లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో రెండో రోజు స్టార్ ప్లేయర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ యానిక్ సిన్నర్ అలవోక విజయం సాధించగా.. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ (పోలండ్), డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవ (చెక్), రష్యా అమ్మాయి మిర్రా ఆండ్రీవా ముందంజ వేశారు. కానీ చైనా సంచలనం కిన్వెన్ ఝెంగ్, మూడో సీడ్ జెస్సిక పెగుల మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ సిన్నర్.. 6-4, 6-3, 6-0తో లుకా నర్డి (ఇటలీ)పై పెద్దగా కష్టపడకుండానే వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు. తొలి సెట్లో కాస్త ప్రతిఘటించిన లుకా.. తర్వాత పూర్తిగా చేతులెత్తేయడంతో సిన్నర్ గెలుపు నల్లేరుపై నడకే అయింది.
11వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా).. 6-2, 6-2, 7-6 (7/2)తో రాబర్టొ (స్పెయిన్)ను చిత్తుగా ఓడించాడు. కానీ ఏడో సీడ్ లొరెంజొ ముసెట్టి (ఇటలీ)కి.. 2-6, 6-4, 5-7, 1-6తో నికోలజ్ బసిలశ్వి (జార్జియా) షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవ.. 3-6, 6-2, 6-1తో అలగ్జాండ్ర ఈల (ఫిలిప్పీన్స్)ను ఓడించింది. 8వ సీడ్ స్వియాటెక్.. 7-6, 5-1తో పొలిన కుడెర్మెటొవను చిత్తుచేసింది. ఏడో సీడ్ మిర్రా ఆండ్రీవ.. 6-3, 6-3తో మేయర్ షెరిఫ్ (ఈజిప్ట్)పై అలవోకగా గెలిచింది. ఐదో సీడ్ ఝెంగ్.. 5-7, 6-4, 1-6తో క్యాథరీన సినియకొవ (చెక్) చేతిలో పరాభవం పాలైంది. మూడో సీడ్ జెస్సిక పెగుల కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది