లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కొత్త విజేత ఆవిర్భవించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జానిక్ సిన్నర్ 4-6, 6-4, 6-4, 6-4తో కార్లోస్ అల్కరాజ్పై చిరస్మరణీయ విజయం సాధించాడు. మూడు గంటల పాటు ఆసక్తికరంగా సాగిన పోరులో ప్రపంచ నంబర్‌వన్ సిన్నర్ విజయకేతనాన్ని ఎగురవేశాడు. అల్కరాజ్ హ్యాట్రిక్ టైటిల్ ఆశలకు చెక్‌పెడుతూ సిన్నర్ తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని సగర్వంగా ఒడిసిపట్టుకున్నాడు. తద్వారా తన కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
నెల రోజుల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి అల్కరాజ్పై సిన్నర్ దీటైన ప్రతీకారం తీర్చుకున్నాడు. అల్కరాజ్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమికి వింబుల్డన్ ఫైనల్లో విజయంతో సమాధానమిచ్చాడు. ఆఖరి వరకు అభిమానులను అలరించిన ఫైనల్ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన సిన్నర్ అద్భుతంగా పుంజుకున్నాడు. అల్కరాజ్కు ఏమాత్రం అవకాశమివ్వకుండా పదునైన సర్వ్‌లకు తోడు బేస్‌లైన్ గేమ్‌తో కట్టిపడేశాడు. 4-6తో మొదటి సెట్ చేజార్చుకున్న ఈ ఇటలీ యువ సంచలనం రెండో సెట్ నుంచి చాంపియన్ ఆటతీరు కనబరిచాడు.
ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ వరుస గేమ్‌ల్లో స్పెయిన్ స్టార్ అల్కరాజ్ను నిలువరిస్తూ పాయింట్లు దక్కించుకున్నాడు. రెండో సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్న సిన్నర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కడా తడబాటుకు గురికాకుండా వరుసగా రెండు సెట్లను ఖాతాలో వేసుకుని వింబుల్డన్ విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో గణాంకాల విషయానికొస్తే సిన్నర్ 8 ఏస్‌లు సంధించగా, అల్కరాజ్ 15 ఏస్‌లు కొట్టాడు. అయితే అల్కరాజ్ 7 సార్లు అనవసర తప్పిదాలు చేస్తే సిన్నర్ రెండుసార్లకే పరిమితమయ్యాడు.
విజేత: రూ. 34.8 కోట్లు
రన్నరప్: రూ. 17.64 కోట్లు