IPL 2023 | ప్రధాన ఆటగాళ్లకు సరైన ప్రాధాన్యతనివ్వకపోవడం.. వేలంలో స్టార్ల బదులు యువ ఆటగాళ్లకు పెద్దపీటవేయడం.. బ్యాటింగ్ కంటే బౌలింగ్ యూనిట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం.. ఇలా లీగ్ ప్రారంభానికి ముందే తమ భిన్నమైన చర్యలతో వార్తల్లోకెక్కిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ).. పరిమిత వనరులతోనే అద్భుతాలు చేయాలని చూస్తున్నది. మూడేండ్లలో ముగ్గురు కెప్టెన్లను మార్చిన రైజర్స్‌కు తాజా సీజన్లో మార్క్మ్ నాయకత్వం వహించనున్నాడు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, ముంబై, కోల్‌కతా జట్ల తీరుతెన్నులను పరిశీలిస్తే..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ;మరో రెండు రోజుల్లో క్రికెట్ పండుగ షురూ కానుండగా.. ఈసారైనా ఆరెంజ్ ఆర్మీ సత్తాచాటాలని హైదరాబాద్ అభిమానులు అశిస్తున్నారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్న సన్‌రైజర్స్ ఈ సారి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్మ్క్రు జట్టు పగ్గాలు అప్పగించింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో తన జట్టుకు టైటిల్ సాధించిపెట్టిన మార్క్మ్.్ర. ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గత రెండు సీజన్లుగా ఐపీఎల్లో హైదరాబాద్ ప్రదర్శన ఘోరంగా ఉంది. 2021లో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన రైజర్స్.. గతేడాది పది జట్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో టైటిల్ నెగ్గిన అనంతరం హైదరాబాద్ ఆ స్థాయి ఆటతీరు కనబర్చలేకపోతున్నది.
తాజా వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంలోనూ సన్‌రైజర్స్ ఆశ్చర్యపరిచింది. నిరుడు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. టామ్ మూడీ స్థానంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడనేది ఆసక్తికరం. ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను దక్కించుకోవడం ఒక్కటే హైదరాబాద్‌కు కాస్త ప్రయోజనం చేకూర్చుతున్నది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్క్ జాన్సెన్‌తో బ్యాటింగ్ ఆర్డర్లో వైవిధ్యం ఉన్నా.. వీరంతా సమిష్టిగా రాణించగలరా చూడాలి! సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తుండగా.. జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్, యార్కర్ కింగ్ నటరాజన్, జాన్సెన్, కార్తీక్ త్యాగి రూపంలో నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు.
బలాలు
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతుండటం సన్‌రైజర్స్‌కు అతి పెద్ద బలమని చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆటగాళ్లు ఉండటం రైజర్స్‌కు కలిసిరానుంది. ఇక ఎప్పటిలాగే రైజర్స్ బౌలింగ్‌లో భారీ స్కోర్లు చేయడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే.
బలహీనతలు
బాధ్యతలు భూజానేసుకొని చివరి వరకు నిలువగలిగే ఆటగాళ్ల లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో శిఖర్ ధవన్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఈ పని చేయగా.. మిడిలార్డర్లో ధాటిగా ఆడగలిగే ఫినిషర్ కనిపించడం లేదు. పేస్ విభాగం బలంగా ఉన్నా.. స్పిన్‌లో పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు.
సిక్సర్‌పై ముంబై గురి!
Rohit Sharma
ఐపీఎల్లో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ నిరుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే నెగ్గి ఆఖరి స్థానానికి పరిమితమైంది. అయితే ఈసారి ఫుల్ జోష్‌లో ఉన్న ముంబై పూర్వవైభవం గుర్తుతేవాలని చూస్తున్నది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా సీజన్‌కు దూరం కాగా.. ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్ ప్రధాన పేసర్ బాధ్యతలు మోయనున్నాడు.
బలాలు
పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కొండంత అండ. ఇటీవల ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ సున్నాలు చుట్టిన సూర్య తిరిగి ఫామ్‌లోకి రావాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. రోహిత్, ఇషాన్, డేవిడ్, తిలక్‌వర్మ, బ్రేవిస్, స్టబ్స్, గ్రీన్, సూర్యకుమార్‌తో ముంబై లైనప్ పటిష్టంగా ఉంది.
బలహీనతలు
బుమ్రా లేకపోవడం ముంబైకి కచ్చితంగా ఎదురుదెబ్బే. తన భిన్నమైన బౌలింగ్ శైలితో పాటు యార్కర్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బుమ్రా స్థానాన్ని ఆర్చర్ భర్తీచేస్తాడా చూడాలి. పేస్ విభా గం ఫర్వాలేదనిపిస్తున్నా.. స్పిన్‌లో ముం బైకి పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు.
మిస్సైల్ మ్యాన్‌పైనే ఆశలు
Missile
భారత రెగ్యులర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక పెద్దగా అనుభవం లేని నితీశ్ రాణాకు ఆ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే తెరవెనుక మంత్రాంగం నడిపేందుకు న్యూజిలాండ్ గ్రేట్ బ్రాండెన్ మెక్కల్లమ్ ఉండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. నిరుడు సంచలన ప్రదర్శన చేసిన ఉమేశ్ యాదవ్ నుంచి మేనేజ్మెంట్ అదే తరహా ఆటతీరు ఆశిస్తుండగా.. విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రీ రస్సెల్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్‌పై కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది.
బలాలు
ఓపెనర్‌గా బరిలోకి దిగి పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోయగల సునీల్ నరైన్‌తో పాటు మిడిల్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే మిస్సైల్ మ్యాన్ రస్సెల్‌పై కేకేఆర్ అతిగా ఆధారపడుతున్నది. వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, టిమ్ సౌథీ, షకీబ్, లోకీ ఫెర్గూసన్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కేకేఆర్ బలం.
బలహీనతలు
శ్రేయస్ అయ్యర్ దూరమవడం కోల్‌కతాకు ప్రధాన సమస్యగా మారింది. బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును నడిపించగల శ్రేయస్ గైర్హాజరీలో నితీశ్ రాణా టీమ్‌ను ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి. విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడుతున్న కేకేఆర్ తుది జట్టు ఎంపిక సమస్యగా మారింది.