మెల్బోర్న్: సీమర్లకు స్వర్గధామంగా మారిన మెల్బోర్న్ పిచ్‌పై ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బౌలర్లు తొలిరోజే వికెట్ల పండుగ చేసుకున్నారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో ఒకే రోజు ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. బౌలర్ల ధాటికి మొదలు ఆతిథ్య ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లండ్.. ఆట మొదటిరోజే తమ తొలి ఇన్నింగ్స్‌లను ముగించాయి. రెండు జట్లూ కలిసి 75.1 ఓవర్లలోనే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అవడం గమనార్హం. ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 45.2 ఓవర్లలో 152 రన్స్‌కే కుప్పకూలింది. ఇంగ్లిష్ పేసర్ జోష్ టంగ్ (5/45) ఐదు వికెట్ల ప్రదర్శనతో కంగారూలను హడలెత్తించాడు. అతడికి తోడు అట్కిన్సన్ (2/28) రాణించడంతో ఆసీస్ కుదేలైంది. నెసెర్ (35) టాప్ స్కోరర్ కాగా టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. కంగారూలను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన పర్యాటక జట్టు ఆనందం ఎంతోసేపు నిలువలేదు. బ్యాట్‌తో ఆసీస్‌ను ఆదుకున్న నెసెర్ (4/45) బంతితోనూ విజృంభించగా అతడికి అండగా స్కాట్ బొలాండ్ (3/30), మిచెల్ స్టార్క్ (2/23) చెలరేగడంతో ఇంగ్లండ్ 29.5 ఓవర్లకే చాపచుట్టేసింది. హ్యారీ బ్రూక్ (41) మినహా స్టార్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 4 రన్స్ చేసి మొత్తంగా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.