ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న వార్నర్ సేన.. ఐదో ఓటమి మూటగట్టుకుంది. కింగ్ కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఓ మాదిరి స్కోరు చేసిన బెంగళూరు.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో క్యాపిటల్స్‌ను కట్టిపడేసింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరగగా.. అరంగేట్ర ఆటగాడు విజయ్ కుమార్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
బెంగళూరు : టాపార్డర్ పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తోలి పోరులో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్) సీజన్లో మూడో అర్ధసెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (22; 3 ఫోర్లు, ఒక సిక్సర్), మహిపాల్ లోమ్రర్ (26; 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24; 3 సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (20 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు.
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం ఫలితాన్నివ్వలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19), పృథ్వీ షా (0), మిషెల్ మార్ష్ (0), యష్ ధుల్ (1), అభిషేక్ పొరెల్ (5), అక్షర్ పటేల్ (21) విఫలమయ్యారు. తొలి మ్యాచ్ ఆడిన విజయ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. హాఫ్ సెంచరీతో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
బెంగళూరు : 174/6 (కోహ్లీ 50, లోమ్రర్ 26; కుల్దీప్ 2/23, మార్ష్ 2/18),
ఢిల్లీ : 151/9 (మనీశ్ పాండే 50, నోర్జే 23 నాటౌట్; విజయ్ కుమార్ 3/20, సిరాజ్ 2/23).