IND vs NZ final : రేపు జరిగే బిగ్ ఫైట్ (Big fight) కు టీమిండియా (Team India) సిద్ధమైంది. ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand) తో తలపడనుంది. గ్రూప్ దశ నుంచి ఓటమి అనేదే లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చిన రోహిత్ సేన.. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించింది. ఫైనల్లో కూడా అదే పెర్ఫార్మెన్స్ను రిపీట్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.
అచ్చొచ్చిన దుబాయ్‌లో అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే వరుణుడు ఇప్పుడు రెండు జట్లను కలవరపెడుతున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే వర్షం పడితే ఛాంపియన్‌గా ఎవరిని ప్రకటిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పటివరకైతే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఎదురయ్యే పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. పూర్తిగా 100 ఓవర్ల మ్యాచ్ సాధ్యమేనని చెబుతున్నారు.
అయితే దుబాయ్‌లో ఈ మధ్య వాతావరణం అంచనాలకు అందని విధంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి..? ఏ జట్టును విజేతగా ప్రకటిస్తారు..? వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం భారత్‌కు ప్లస్సా.. మైనస్సా..? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే సోమవారం నిర్వహిస్తారు.
మ్యాచ్ జరిగే ఆదివారంతోపాటు రిజర్వ్ డే అయిన సోమవారం కూడా ఐసీసీ రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయించింది. అంటే వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే అదనంగా మరో రెండు గంటలపాటు కూడా ఎదురు చూస్తారు. ఆ రెండు గంటల్లో కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే భారత్-న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. రెండు జట్లు ట్రోఫీని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వరుణుడు ఏం చేస్తాడో చూడాలి..!