ICC Player of the Month | క్రికెట్లో పలు ఇన్నింగ్స్‌లు కేవలం స్కోర్కార్డుకే పరిమితం కాకుండా చరిత్రలో నిలిచిపోతాయి. టీమిండియా వుమెన్స్ జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఆడిన ప్రపంచ కప్ ఫైనల్ ఇన్నింగ్స్ సైతం అలాంటిదే. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శన చేసిన భారత ఓపెనర్ షెఫాలీ.. నవంబర్ మాసానికి సంబంధించి ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. షెఫాలీ బ్యాట్, బంతితో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. తొలి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను అందించడంలో షెఫాలీ కీలక పాత్ర పోషించింది.
టైటిల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన షెఫాలీ 87 పరుగులు చేసింది. షెఫాలీ, స్మృతి మంధానతో కలిసి 104 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. భారత్‌కు శుభారంభం అందించింది. ఒత్తిడిలోనూ ఈ సంయమనంతో రాణించింది. బ్యాటింగ్‌తో పాటు, షెఫాలీ బంతితో కూడా తన సత్తా చాటింది. ఏడు ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ సునే లూస్, మరిజానే కాప్‌ను పెవిలియన్‌కు పంపింది. దాంతో ప్రొటీస్ జట్టు ఒత్తిడికి గురైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 246 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. వాస్తవానికి వరల్డ్ కప్‌లో షెఫాలీకి చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రతీక రావల్‌కు గాయం కావడంతో జట్టుతో చేరింది. సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కేవలం 10 పరుగులు చేసింది. ఫైనల్లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. ఆ మ్యాచ్‌లో షెఫాలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
ఈ ప్రదర్శనతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు ఎంపికైంది. ఐసీసీ నుంచి అవార్డు అందుకున్న తర్వాత షెఫాలీ మాట్లాడుతూ ప్రపంచకప్‌లో తాను ఊహించినట్లుగా జరుగలేదని.. ముగింపు నేను ఆశించిన దానికంటే అందంగా ఉందని పేర్కొంది. ఫైనల్లో జట్టుకు నా వంతు సహకారం అందించగలిగినందుకు, సొంత ప్రేక్షకుల ఎదుట టైటిల్‌ను సాధించడంలో భాగమైనందుకు కృతజ్ఞురాలిని అని వ్యాఖ్యానించింది. ఈ అవార్డు జట్టు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, ఈ ప్రయాణంలో తనకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపింది. తాము జట్టుగా గెలుస్తామని, ఓడిపోతామని.. అవార్డు మాత్రం జట్టుకే చెందుతుందని తెలిపింది. షెఫాలీ వర్మ డిసెంబర్ 21న విశాఖపట్నంలో ప్రారంభమయ్యే శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నది. ఆ జట్టు ఓపెనర్‌ను రిటైన్ చేసుకుంది.