Shoaib Malik – Sana Javed: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఆ దేశ నటి సనా జావేద్‌ను పెండ్లి చేసుకున్నాడు. జనవరి 19న ఈ జంట వివాహబంధంతో ఒక్కటైంది. ఈ మేరకు ఇరువురు తమ సోషల్ మీడియా ఖాతాలలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువే. సనా కంటే షోయబ్ ఏకంగా 11 ఏండ్లు పెద్దవాడు.
షోయబ్ మాలిక్ 1982లో పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో ఓ మధ్యతరగతి పంజాబీ – ముస్లిం కుటుంబంలో జన్మించాడు. మాలిక్ తండ్రి స్థానికంగా చెప్పుల దుకాణాన్ని నడిపేవాడు. తన కొడుకు పాకిస్తాన్ జట్టుకు ఆడేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. 2006లో ఆయన గొంతు క్యాన్సర్‌తో చనిపోయాడు. ఇక 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మాలిక్.. ఆ దేశం తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. ప్రస్తుతం జాతీయ జట్టులో అతడు చోటు కోల్పోయినా ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.
సనా విషయానికొస్తే.. 1993 మార్చి 25న జెడ్డా (సౌదీ అరేబియా)లో జన్మించిన ఆమె, అక్కడ పాఠశాల విద్య వరకు చదువుకుని ఆ తర్వాత పాకిస్తాన్‌కు వచ్చింది. కరాచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన సనా.. 2012లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆదిలో సీరియల్స్, టీవీ షోల ద్వారా ఫేమ్ దక్కించుకున్న ఆమె 2017లో వెండితెరపై మెరిసింది. 2020లో ఆమె గాయకుడు ఉమేర్ జస్వాల్‌ను పెళ్లాడింది. కానీ మూడేండ్లకే ఈ ఇద్దరూ విడిపోయారు. తాజాగా ఆమె మాలిక్‌ను వివాహమాడింది.