Delhi High Court | ఢిల్లీ హైకోర్టులో అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్లకు ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఎన్నికలను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. రెజ్లర్లు కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో.. హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. సంజయ్ సింగ్ డబ్ల్యూఫ్ఐ అధ్యక్ష ఎన్నికల్లో అనితా షియోరన్పై గెలుపొందారు. అనితకు రెజ్లర్ల మద్దతు తెలిపారు.
నవంబర్ 27న ఈ కేసును విచారించిన జస్టిస్ మినీ పుష్కర్ణ విచారణ సమయంలో పిటిషనర్లు ఎవరూ కోర్టుకు రాకపోవడాన్ని గమించారు. ఈ అంశం పలుసార్లు విచారణకు వచ్చినా విచారణకు హాజరుకాలేదు. దాంతో కోర్టు ‘ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పిటిషనర్లకు ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది’ అని పేర్కొంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు న్యాయమైన, పారదర్శక వాతావరణంలో జరుగలేదని రెజర్లు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలు, అక్రమాలు జరిగాయంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణకు రెజర్లు హాజరుకాకపోవడంతో ఆయా పిటిషన్లు ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.