బెంగళూరు: దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తొలి రోజే అదరగొట్టింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ ‘బీ’ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (206 బంతుల్లో 184, 25 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. అతడికి తోడు స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ (65 బ్యా టింగ్), ఆర్యన్ దేశాయ్ (39) రాణించారు. యశస్వీ జైస్వాల్ (4), భారత జట్టులో రీఎంట్రీ కోసం వేచిచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ (25) నిరాశపరిచారు.
నార్త్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సౌత్‌జోన్ నిలకడగా ఆడుతున్నది. తమిళనాడు ఆటగాడు జగదీశన్ (260 బంతుల్లో 148 బ్యాటింగ్, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు దేవ్‌దత్ పడిక్కల్ (57), తన్మయ్ అగర్వాల్ (43) రాణించారు. మొదటి రోజు ఆట చివరికి సౌత్‌జోన్.. 297/3 స్కోరు చేసింది.