ట్రినిడాడ్: పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్(WI vs PAK)ను వెస్టిండీస్ సొంతం చేసుకున్నది. మూడో వన్డేలో 202 రన్స్ భారీ తేడాతో విజయం నమోదు చేసింది. విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ ఆరు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ శాయ్ హోప్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ కైవసం చేసుకున్నది. 1991 తర్వాత అంటే.. 34 ఏళ్ల తర్వాత పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను విండీస్ గెలుచుకున్నది.
మూడో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 294 రన్స్ చేసింది. విండీస్ జట్టులో కెప్టెన్ హోప్ 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్ 36, జస్టిన్ గ్రీవ్స్ 43 రన్స్ చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
295 టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ షాకిచ్చాడు. నిప్పులు చెరిగే వేగంతో అతను బంతులు విసిరాడు. దీంతో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. కేవలం 92 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. విండీస్ 42 ఓవర్లలో 184 రన్స్ చేసి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో హోప్, గ్రీవ్స్ భారీ షాట్లతో అలరించారు. ఆ ఇద్దరూ చివరి 8 ఓవర్లలో 110 రన్స్ చేశారు.
వన్డేల్లో హోప్ 18వ సెంచరీ నమోదు చేవాడు. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మూడవ విండీస్ బ్యాటర్‌గా నిలిచాడతను. అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో క్రిస్ గేల్ 25, బ్రియాన్ లారా 19 ఉన్నారు.
Shai Hope and Jayden Seales stand up for the West Indies to claim ODI series victory over Pakistan 🙌#SAvWI 📲 https://t.co/D8Jtqrd9Gw pic.twitter.com/CaFlrx3oU4
— ICC (@ICC) August 13, 2025