క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్‌లు నెగ్గి లెక్క సరిచేసినా.. నిర్ణయాత్మక పోరులో అదే జోరు కనబర్చలేకపోయింది. ఓపెనర్ల వైఫల్యంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన హార్దిక్ సేన.. బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేయలేకపోయింది. సిరీస్ పోయినా.. ఈ టూర్‌తో తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ రూపంలో నాణ్యమైన ప్లేయర్లు టీమ్ఇండియా భవిష్యత్తు తారలు అనిపించుకున్నారు.
లాడర్‌హిల్: బ్యాటర్ల వైఫల్యానికి, బౌలర్ల నిస్సాహయత తోడవడంతో వెస్టిండీస్‌తో ఐదో టీ20లో భారత్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్ఇండియా ప్రభావం చూపలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీతో రాణించగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్‌లో దంచికొట్టిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), శుభ్‌మన్ గిల్ (9) విఫలం కాగా.. సంజూ శాంసన్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (13) తలా కొన్ని పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 4, అకీల్ హుసేన్, హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. పూరన్ (35 బంతుల్లో 47; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో తిలక్‌వర్మ, అర్ష్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 165 పరుగులు జతచేసిన భారత ఓపెనర్లు నిలకడ కొనసాగించలేకపోయారు. తొలి ఓవర్ ఐదో బంతికే యశసి జైస్వాల్ బౌలర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. మూడో ఓవర్లో గిల్ పెవిలియన్ బాటపట్టాడు. అకీల్ హుసేన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన గిల్.. రివ్యూ కోరకుండానే వెనుదిరిగాడు. అనంతరం రీప్లేల్లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు తేలడంతో గిల్ అనవసరంగా వికెట్ కోల్పోయినట్లు తేలింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హైదరాబాదీ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఆరో ఓవర్లో తిలక్ వర్మ వరుసగా 4,6,4,4, బాది ఇన్నింగ్స్‌లో జోష్ నింపాడు. సూర్యకుమార్ కూడా భారీ షాట్లతో మోత మొదలు పెట్టడంతో భారత్‌కు తిరుగుండదనిపించింది. అయితే రోస్టన్ చేజ్ అద్భుతమైన డైవ్ చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకోవడంతో తిలక్ డగౌట్ చేరక తప్పలేదు. సంజూ శాంసన్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. పాండ్యా వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా వరుసగా 28 బంతుల పాటు భారత్ ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. సూర్యకుమార్ 38 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అరగంటకు పైగా క్రీజులో గడిపిన హార్దిక్ పాండ్యా ఒక్క సిక్సర్ మాత్రమే కొట్టి షెఫర్డ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివర్లో అర్ష్‌దీప్ సింగ్ (8) అక్షర్ పటేల్, విలువైన పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గత మ్యాచ్‌లో మన ఓపెనర్లు తొలి వికెట్‌కు 165 పరుగులు జోడించగా.. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు కోల్పోయి కూడా సరిగ్గా అన్నే పరుగులు చేయడం కొసమెరుపు.