West Indies | ముల్తాన్ : సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్.. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో అదరగొట్టింది. ముల్తాన్ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన చివరి టెస్టులో ఆతిథ్య జట్టు ఎదుట 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన విండీస్.. మూడో రోజు పాక్‌ను 133 పరుగులకే కుప్పకూల్చి 120 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఈ క్రమంలో 34 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై విండీస్ టెస్టు మ్యాచ్ గెలువడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 76/4తో మూడో రోజు క్రీజులోకి వచ్చిన షాన్ మసూద్ సేన.. విండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ (5/27) స్పిన్‌కు విలవిల్లాడింది. అతడితో పాటు సింక్లెయిర్ (3/61) రాణించాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (2023-25) లో ఇరు జట్లకూ ఇదే చివరి టెస్టు కాగా ఈ ఓటమితో పాకిస్థాన్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.