మౌంట్ మౌంగనుయి(న్యూజిలాండ్) : న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. పరుగుల వరద పారుతున్న పోరులో ఆధిక్యం చేతులు మారుతున్నది. కివీస్ నిర్దేశించిన 462 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఓపెనర్లు బ్రాండన్‌కింగ్ (37), జాన్ క్యాంప్‌బెల్ (2) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 381/6 నాలుగో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్ 420 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్(123 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. జాకబ్ డఫీ(4/86), ఇజాజ్ పటేల్ (3/113) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ 54 ఓవర్లలో 306/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (101), డెవాన్ కాన్వె (100) దూకుడైన బ్యాటింగ్‌తో సెంచరీలు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కవెమ్ హాడ్జ్(2/80)కు రెండు వికెట్లు దక్కాయి.