West Indies Legends : వెస్టిండీస్ మాజీ క్రికెటర్ల మధ్య అగ్గి రాజుకుంది. ఆ దేశ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara)పై మాజీ కెప్టెన్లు మండిపడుతున్నారు. లారా తన తాజా పుస్తకంలో తమపై బురదజల్లాడని, అన్నీ అవాస్తవాలే రాశాడని కరీబియన్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ (Viv Richards), మాజీ సారథి కార్ల్ హూపర్ (Carl Hooper)లు ఆక్రోశం వ్యక్తం చేశారు.
తమ పేరును చెడగొట్టే ప్రయత్నం చేసినందుకు లారా క్షమాపణలు చెప్పాలని రిచర్డ్స్, హూపర్‌లు డిమాండ్ చేశారు. తన పుస్తక ప్రచారం కోసం మమ్మల్ని బద్నామ్ చేశాడని లారా దుయ్యబట్టారు. వెస్టిండీస్ క్రికెట్లో లారా రాసిక కొత్త పుస్తకం పెద్ద అలజడి సృష్టించింది. మాజీల మధ్య వివాదానికి కేంద్ర బిందువు అయింది.
విండీస్ మాజీ సారథి అయిన లారా ఈ మధ్యే ‘లారా ఇంగ్లండ్ క్రానికల్స్’ (Lara : The England Chronicles) అనే పుస్తకం విడుదల చేశాడు. ఆ బుక్‌లో అప్పటి కెప్టెన్ రిచర్డ్స్ గురించి అతడు పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో రిచర్డ్స్ ప్రవర్తన భయం గొలిపేలా ఉండేది. అంతేకాదు విండీస్‌ను మెరుగైన జట్టుగా మార్చేందుకు ఆయన అనుక్షణం తాపత్రయపడేవాడు. ఆ క్రమంలోనే అతడు నన్ను వారానికి మూడుసార్లు ఏడిపించేవాడు. కానీ, హూపర్‌ను వారంలో ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకునేలా చేసేవాడు. రిచర్డ్స్ మాటలు చాలా పరుషంగా ఉండేవి.

ఒకవేళ వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటే ఎంతో నష్టపోయేవాళ్లం. అయతే.. నేను ఏమీ భయపడలేదు. రిచర్డ్స్ తీరును నేను స్వాగతించేవాడిని. నేను అతడి భుజాల వరకే ఉండేవాడిని. అందుకని మానసికంగా ధ్రుడంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. కొన్నిసార్లు రిచర్డ్స్ బారి నుంచి నన్ను హూపర్ కాపాడేవాడు’ అని లారా కొన్ని పేరాల్లో వివరించాడు. అయితే.. లారా తన బుక్‌లో తమ గురించి చెప్పిన విషయాల్ని రిచర్డ్స్, హూపర్‌లు కొట్టిపారేశారు. అవన్నీ కట్టు కథలేనని లారా తమకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఇద్దరూ మీడియాకు తెలిపారు.
“Sir Vivian Richards and Mr. Carl Hooper are deeply disheartened by the gross misrepresentations made about them in Mr. Brian Lara’s recently released book. The allegations presented not only distort the reality of their relationship but also impugn their characters in an unjust… pic.twitter.com/wb659PknwH
— Cricketopia (@CricketopiaCom) July 22, 2024
‘హూపర్‌ను వారానికి ఒకసారి రిచర్డ్స్ ఏడిపించేవాడనేది పూర్తిగా అబద్దం. అందుకు ఎలాంటి ఆధారం లేదు. ఈ రాతలు విండీస్ లెజెండ్ రిచర్డ్స్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. హూపర్కు రిచర్డ్స్ తొలి కెప్టెన్. అందుకని హూపర్‌ను ఆయన నిత్యం ప్రోత్సహించేవాడు. ఇద్దరూ తమ 40 ఏండ్ల అనుబంధంలో పరస్పరం గౌరవించుకున్నారు’ అని ఓ మీడియా కథనం వెల్లడించింది.
