Bernald Julien : వెస్టిండీస్ క్రికెట్లో విషాదం నెలకొంది. తొలితరం క్రికెటర్, మొట్టమొదటి ప్రపంచకప్ గెలుపొందిన బెర్నార్డ్ జులియన్ (Bernald Julien) కన్నుమూశాడు. క్లైవ్ లాయిడ్ సారథ్యంలో 1975 ప్రపంచ కప్ విజేతగా అవతరించిన జట్టులో సభ్యుడైన బెర్నార్డ్ 75 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. నార్తర్న్ ట్రినిడాడ్‌లో ఆయన మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. వెటరన్ ప్లేయర్, వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన బెర్నాల్డ్ మృతిపట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం తెలియజేసింది.
‘బెర్నాల్డ్ మరణం మమ్మల్ని ఎంతో బాధించింది. ఆయన జట్టుకు అందించిన సేవల్ని కొనియాడుతున్నాం. విండీస్ జట్టు మొదటి వరల్డ్ కప్ విజేతగా అవతరించడంలో బెర్నాల్డ్ కృషి ఎంతో ఉంది. ఈ కష్టసమయంలో ఆయన స్నేహితులు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. క్రికెట్ పట్ల ఆయన నిబద్ధత కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్ధిస్తున్నాం’ అని విండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిశోర్ షాల్లో పేర్కొన్నాడు.
Statement on the Passing of Legend Bernard Julien by Dr. Kishore Shallow, President of Cricket West Indies.
Read More 🔽https://t.co/cwYl3btsC7
— Windies Cricket (@windiescricket) October 5, 2025
1975 ప్రపంచ కప్ విజేతగా అవతరించిన జట్టు
ఆల్‌రౌండర్ అయిన బెర్నాల్డ్ కుడిచేతివాటం బ్యాటర్, మంచి స్పిన్నర్ కూడా. అతడు 1973 నుంచి1977 మధ్య కాలంలో24 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. వన్డే వరల్డ్ కప్‌లో విండీస్ విజేతగా నిలవడంలో బెర్నాల్డ్ పాత్ర మరువలేనిది. శ్రీలంక, న్యూజిలాండ్‌పై నాలుగేసి వికెట్లతో చెలరేగిన అతడు ఫైనల్లో బ్యాటుతో మెరిశాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టైటిల్ పోరులో ఆస్ట్రేలియాపై 26 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకమయ్యాడు. 1973లో లార్డ్స్ టెస్టులో బెర్నాల్డ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ 121 పరుగులతో రాణించి జట్టును గెలిపించాడు. అయితే.. సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ఆడాల్సిన అతడు రెబల్ గ్రూప్‌లో చేరిపోయాడు. అలా.. బెర్నాల్డ్ అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.