సోనిపట్: కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటామని, లేదంటే లేదని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేసింది. తాము ప్రతిరోజు ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నామో మీరు అర్థం చేసుకోవడంలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించింది. హర్యానాలోని సోనిపట్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెను మీడియా పలకరించగా పై వ్యాఖ్యలు చేసింది.
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని గత కొన్నాళ్లుగా మహిళ రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో ఆందోళనకు దిగారు. కొన్నాళ్ల ఆందోళన అనంతరం దిగొచ్చిన కేంద్రం జూన్ 15 లోగా విచారణ బ్రిజ్‌భూషణ్‌పై దర్యాప్తు పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చింది. దాంతో రెజ్లర్లు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.