WCL 2025 | లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారత్ నిరాకరించిన తర్వాత టోర్నీలో గందరగోళం నెలకొన్నది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో టోర్నీని ముందుకు తీసుకెళ్లడంలో నిర్వాహకులు ఇబ్బందిపడుతున్నారు. అయితే, చాంపియన్‌షిప్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆదివారం పాకిస్తాన్‌తో జరగాల్సి ఉండగా.. శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, కెప్టెన్ యువరాజ్ సింగ్ వంటి ప్లేయర్ పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంతో మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే, రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మరోసారి ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు మరోసారి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. భారతదేశం మ్యాచ్ ఆడకూడదని ఇప్పటికే నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో పాయింట్ల కేటాయింపుపై సమస్య తలెత్తుతున్నది. భారత్-పాకిస్తాన్ కూడా ఫైనల్లో తలపడేందుకు అవకాశం ఉంది. అయితే, ఇదంతా పాయింట్ల పట్టికపైనే ఆధారపడి ఉండనున్నది. సెమీ ఫైనల్స్ తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. అయితే, పాక్ జట్టు టీమ్ యజమాని కమిల్ ఖాన్ టోర్నీ భవిష్యత్‌పై మాట్లాడుతూ.. చాంపియన్‌షిప్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొన్నాడు. నాకౌట్లలో రెండు జట్లు మళ్లీ తలపడాల్సి వస్తే డబ్ల్యూసీఎల్ చర్యలు తీసుకుంటుందని.. మిగిలిన అన్ని మ్యాచులు జరుగుతున్నాయని.. షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని చెప్పాడు.
సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ విషయానికొస్తే, తాము సెమీఫైనల్‌కు చేరుకుంటు నాలుగు పాయింట్లు ఉంటాయని చెప్పాడు. భారత జట్టు మ్యాచ్ నుంచి వైదొలిగినందున పాక్ జట్టుకు రెండు పాయింట్లు ఇస్తారని.. నిబంధనల ప్రకారం తాము ఈ రెండు పాయింట్లకు అర్హులమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం ఈ మ్యాచ్‌పై స్పందించాడు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్పమని కోరగా.. ఇదో కఠినమైన ప్రశ్న అని తెలిపాడు. ఇరుదేశాలను తాను ప్రేమిస్తున్నానని.. ఇద్దరు తమను తాము అభినందించే స్థితికి చేరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. టోర్నీ కోసమే ఇక్కడికి వచ్చామని.. ఆస్ట్రేలియా, భారతదేశం, దక్షిణాఫ్రికా అందరిని కలుపుకొని ఉన్నామని వ్యాఖ్యానించాడు.