CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. న్యూజిలాండ్, కివీస్‌లు 8 మ్యాచ్‌లు ఆడగా మిగిలిన టీమ్స్ అన్ని ఏడు మ్యాచ్‌లు ఆడేశాయి. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్నది 37వ లీగ్ మ్యాచ్. కాగా మొత్తం ఈ ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్‌లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు భర్తీ కాకపోవడం గమనార్హం. భారత్, సౌతాఫ్రికాలు మాత్రమే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి.
ఆ నాలుగు జట్లు..
మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ ఉంది. పాయింట్ల పట్టికలో ఇండియా, సౌతాఫ్రికా తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పది పాయింట్లతో ఉండగా నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఎనిమిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ఉంది. ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కూడా నాలుగింట్లో గెలిచి 8 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ (+0.0398), పాకిస్తాన్ (+0.036) కంటే మెరుగ్గా ఉంది. అఫ్గానిస్తాన్ ఏడు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
సెమీస్ రేసులో ఆసీస్ ముందంజ..
పాయిట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. శనివారం ఇగ్లండ్తో గెలిచిన తర్వాత దాదాపు సెమీస్ ఛాన్సులను మరింత మెరుగుపరుచుకుంది. ఆసీస్ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఆ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. కానీ రెండు మ్యాచ్‌లలోనూ ఓడితే మాత్రం ఆ జట్టుకు తిప్పలు తప్పవు.
కివీస్‌కు..
పాకిస్తాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడటంతో కివీస్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. న్యూజిలాండ్.. ఈ మెగా టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కివీస్ సెమీస్‌కు చేరుతుంది.
పాకిస్తాన్‌కు..
బెంగళూరులో కివీస్‌ను ఓడించి అనూహ్యంగా సెమీస్ రేసులోకి వచ్చిన పాకిస్తాన్.. ఇంగ్లండ్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గెలవడమే కాదు శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. అఫ్గానిస్తాన్ తాము ఆడబోయే తర్వాత రెండు మ్యాచ్‌లలోనూ ఓడాలి. ఒకవేళ న్యూజిలాండ్.. శ్రీలంకను 50 పరుగుల తేడాతో ఓడిస్తే పాకిస్తాన్.. తమ తర్వాత మ్యాచ్‌లో కనీసం 180 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించాలి. ఒకవేళ కివీస్ ఒక్క పరుగు తేడాతో గెలిస్తే పాకిస్తాన్ 131 పరుగుల తేడాతో గెలవాలి.
అఫ్గానిస్తాన్‌కు..
అఫ్గానిస్తాన్ తర్వాత రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియాతోనూ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో గనక అఫ్గాన్ సంచలన ఫలితాలు నమోదుచేస్తే పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్‌ల కథ ముగిసినట్టే. ఇదివరకే నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ప్రపంచకప్ రాబోయే వారం రోజుల పాటు క్రికెట్ అభిమానులకు మరింత మజానివ్వడం ఖాయం.