Ind vs Pak ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్ జట్టుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేసిన తీరు మరీ ఘోరమనే వ్యాఖ్యలు వినపిస్తున్నాయి. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో తలపడ్డ ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌లో పరాజయం అనంతరం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీని పాక్ సారథి బాబర్ ఆజమ్ తీసుకోవడంపై అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెర్సీ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని.. అంతగా కావాలనుకుంటే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాల్సిందని అభిప్రాయపడ్డాడు.
‘మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో కోహ్లీ నుంచి బాబర్ జెర్సీ తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకుంటే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ వద్దనో లాబీలోనో తీసుకోవాల్సింది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఇలాంటివి చూసినప్పుడు కామెంట్ చేయక తప్పడం లేదు. మీ బంధువుల అబ్బాయి ఎవరైనా కోహ్లీ జెర్సీ అడిగి ఉంటే.. ఆట అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వద్ద ప్రైవేట్‌గానే ఆ జెర్సీ తీసుకోవాల్సింది’ అని బాబర్‌ను ఉద్దేశించిన అక్రమ్ వ్యాఖ్యానించాడు. కాగా.. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా.. బ్యాటింగ్‌లో రోహిత్ మెరుపులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.