తెలంగాణలో లంబాడీ సమాజిక వర్గానికి దగ్గర లక్షణాలుండే లంబానీలు బళ్లారి ప్రాంతంలో ఉన్నారు. వారి ఎంబ్రాయిడరీ కళ అద్భుతమైనది! మరే ఎంబ్రాయిడరీ దానికి సాటిరాదు! అయినా.. ఆ సామాజిక వర్గమే దూరం పెడుతున్న సంప్రదాయ దుస్తులను నగరాల్లోని నవతరానికి పరిచయం చేయాలని ‘తెగ’ ప్రయత్నం చేస్తోంది నిహారిక ఏలేటి. అమెరికాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన నిహారిక ఆవిష్కరించిన ‘తెగ’ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో భారతీయ అందాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది! మెట్రోపాలిటన్ సిటీల్లోనిటెకీలనే కాదు పాశ్చాత్య ఫ్యాషన్ ప్రపంచమూ లంబానీ అందాలపై ‘తెగ’ మోజు పడుతున్నది!
నిహారికకు చిన్నప్పటి నుంచే కళలంటే ఇష్టం. అమెరికాలో పెరిగిన ఆ అమ్మాయి పదకొండేండ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చింది. భారతీయ సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్లినా భిన్న సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి. ఒకే ప్రాంతంలో అనేక సామాజిక వర్గాలతోపాటు వాటికి సంబంధించిన కళలు కనిపిస్తాయి. ఈ సాంస్కృతిక వైవిధ్యమే నిహారికను ఆకట్టుకుంది. కళలపట్ల ఆసక్తి చూపే నిహారిక దృష్టి స్థానిక ఆదివాసీ కళలపై పడింది. ‘సౌత్ ఏషియన్ ఫైన్ ఆర్ట్స్’ని అధ్యయనం చేసింది. తర్వాత బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు అమెరికాకు వెళ్లింది.
ఇష్టమైన క(ల)ళ కోసం
పర్యావరణం, కళలు, సంస్కృతి ఇష్టమైన సబ్జెక్టులు వదిలి బయో మెడికల్ ఇంజినీరింగ్‌లో చేరిన నిహారికకు అమెరికా చదువు అంత సంతృప్తినివ్వలేదు. అది తన అభిరుచులకు అనువైన రంగం కాదనుకుంది. తనకు ఇష్టమైన కళలు, సంస్కృతిక రంగాల్లోనే కెరీర్‌ను వెతుక్కోవాలనుకుంది. సుస్థిరమైన ఫ్యాషన్లోకి ఆదివాసీ కళలను పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. సుస్థిరాభివృద్ధి అనగానే మారుమూల పల్లెలు, ఆదివాసీ గూడేల్లో వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, సేంద్రియ సాగే అనుకుంటారు. ఫ్యాషన్ దునియాలోనూ సుస్థిరాభివృద్ధి చేపట్టవచ్చని భావించింది నిహారిక. స్థానిక కళలు, సంస్కృతిని మేళవించేందుకు బెంగళూరు కేంద్రంగా ‘తెగ’ కలెక్టివ్‌ని ప్రారంభించింది.
కొత్త కుటుంబంలోకి
‘తెగ’ అనే పదానికి ‘కుటుంబం’ అని అర్థం. ఒక కుటుంబానికి రక్త సంబంధాలే కాదు, వాళ్ల ఆహార్యం కూడా గుర్తింపే. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో లంబాని (లంబాడా) సామాజిక వర్గం ఉంటుంది. వాళ్ల ఎంబ్రాయిడరీ ఆకట్టుకునేలా ఉంటుంది. కళలు, సంస్కృతులు చదివిన విద్యార్థికి నచ్చినట్టుగా సంచార జాతుల, ఆదివాసీల కళలు నగర యువతకు నచ్చదు. కాబట్టి వాటిని టెక్ ప్రపంచంలో ‘కొలువు’దీరిన యువతకు చేరువ చేయాలనుకుంది నిహారిక. బళ్లారిలోని సుందర కుశల కళా కేంద్రంతో కలిసి తెగ కలెక్టివ్ పని చేయడం మొదలుపెట్టంది. ‘మన దగ్గర లంబానీల దుస్తులు, అలంకారాలను నేటి యువతే ఆదరించట్లేదు. ఇక నగరాల్లో ఉన్నవాళ్లు ఆదరిస్తారా?’ అందరికీ సందేహాలొచ్చినా నిహారిక ఆ కళకు ఉన్న అందం, ఆకర్షణ మీద నమ్మకంతో ముందుకే నడిచింది. మొత్తానికి లంబానీల వస్ర్తాలంకరణను అధ్యయనం చేసి, ఏ ఎంబ్రాయిడరీని ఏ దుస్తుల మీదకు తీసుకురావొచ్చో కొన్ని ప్రయత్నాలు చేసింది. కొత్తదనానికి ఆకట్టుకునే లక్షణమే కాదు టెక్ ఇండస్ట్రీలో పని చేసే యువతకు అది మోజు కూడా! ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల దుస్తులకు గవ్వలు, అద్దాలు జోడించింది. వాటి చుట్టూ అల్లికలతో చేసిన అలంకరణలన్నీ చేసి ఆధునిక జీన్స్, షర్ట్స్, స్కర్ట్స్ మీదకు తీసుకువచ్చింది. ఈ పాతతరం ముస్తాబు కొత్తతరం కట్టుకునే దుస్తులపై చేరగానే కొంగొత్తగా అనిపించి ఫ్యాషన్ మార్కెట్లో ‘తెగ’ బ్రాండ్‌కు మంచి పాపులారిటి వచ్చింది.

గ్లోబల్ ఫ్యాషన్‌లో గెలిచిన అందాలు!
నేత, అద్దకం, ఎంబ్రాయిడరీతో కొత్తగా లంబానీ దుస్తులను ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేస్తున్న ‘తెగ’ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఫ్యాషన్‌లో మినిమలిజం పెరిగిపోయి తక్కువ రంగులకే పరిమితమైన వస్త్రధారణకు ఆదరణ ఎక్కువగా ఉంది. అలాంటి మార్కెట్లో అనేక రంగులు, చిత్ర విచిత్రమైన ఆకృతులతో ఉండే ఎంబ్రాయిడరీని చొప్పించి యువతను మెప్పించడం కష్టమైన పనే. దాని కోసం నిహారిక బృందం లంబానీల డిజైన్లను యథాతథంగా కాకుండా చిన్న చిన్న మార్పులతో కొత్త లుక్ తెచ్చింది. ఒక డ్రెస్‌పై అనేక రకాలైన డిజైన్లను చొప్పించకుండా సృజనాత్మక విన్యాసాలు చేసి మార్కెట్లో నిలదొక్కుకుంది. లంబానీ ఎంబ్రాయిడరీ కళలో పద్నాలుగు రకాలైన కుట్లతో రకరకాల ఆకృతులను సృష్టించే చేతి వృత్తుల వారికి ‘తెగ’ చేతినిండా పని కల్పించింది.
వాళ్లతో యువత అభిరుచులకు తగ్గట్టు దుస్తులపై పూలు, మొక్కలు, డిజైన్లను అల్లిస్తున్నది. రంగులు, దారాలలో తీర్చిదిద్దిన చిత్ర విచిత్రమైన ఆకృతులు వహ్వా అనిపిస్తున్నాయి. పాశ్చాత్య దుస్తులు భారతీయ మార్కెట్‌ని పూర్తిగా ఆక్రమించిన కాలంలో భారతీయ ఎంబ్రాయిడరీ, అద్దకం కళలను పాశ్చాత్య దేశాల వాళ్లను ఆకర్షించేలా చేసిన నిహారిక కృషిని ఎన్ఆర్ఐలు, విదేశీయులు కూడా అభినందిస్తున్నారు. కొత్త తరానికి పాతకాలపు అందాలను పరిచయం చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న నిహారిక ప్రయోగం ఫ్యాషన్ ప్రియులనే కాదు సుస్థిరాభివృద్ధిని కోరుకునేవారికీ నచ్చింది. సహజరంగులను వాడుతూ, సింథటిక్, పాలిస్టర్‌కు దూరంగా అందం, ఆరోగ్యాన్ని చాటే నిహారిక ప్రయత్నం పెద్దలను మెప్పించింది. అందరికీ నచ్చే ఈ దుస్తులు ఆన్లైన్ మార్కెట్లో దేశ సరిహద్దులు దాటాయి. లంబానీ ఎంబ్రాయిడరీ దుస్తులు న్యూయార్క్, లండన్ నగరాలకే కాదు, గ్లోబల్ ఫ్యాషన్ సమ్మిట్‌కూ చేరాయి.