రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నా.. వంటింటి పని యుద్ధమే! ఎంత అనుభవం ఉన్నా… ఉడికించిన గుడ్డు పెంకు తీయడం ఒక్కోసారి కత్తి మీద సాములా అనిపిస్తుంది. అంతేనా, ఆకుకూరలు జాగ్రత్త చేయడం నుంచి పాత్రల జిడ్డు వదిలించడం వరకూ ప్రతి పనీ సవాలు విసురుతుంటుంది. ఈ టిప్స్ పాటించి చూడండి. మీ వంటింటి పని కాస్తైనా తేలిక అవుతుంది.
సాధారణంగా కోడిగుడ్లను నేరుగా చల్లటి నీళ్లలో వేసి ఉడకబెడుతుంటాం. కానీ, ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు గుడ్డు పెంకు తీయడం కష్టమవుతుంది. అందుకే నీళ్లు కాస్త వేడయ్యాక వాటిలో గుడ్లు వేసి ఉడకబెడితే.. పెంకులు సులభంగా వస్తాయంటున్నారు నిపుణులు. కావాలనుకుంటే ఈ వేడి నీటిలో కాస్త వినెగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఆకుకూరలు తాజాగా ఉంటేనే కూర రుచికరంగా ఉంటుంది. అయితే వీటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే త్వరగా వాడిపోతుంటాయి. ప్రత్యేకించి కొన్ని ఆకుకూరలు ఫ్రిజ్‌లో పెట్టినా తాజాదనం కోల్పోతాయి. ఇలా జరగకుండా ఆకుకూరలను కట్ చేసి ఐస్ క్యూబ్ ట్రేలో వేసి నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి తాజాగా ఉండడంతో పాటు అందులోని పోషకాలు తరిగిపోకుండా ఉంటాయట.
నట్స్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల నట్స్‌పై పెంకు లాంటి పదార్థం ఉంటుంది. ఈ క్రమంలో అవి గట్టిగానే ఉన్నాయి కదా అని కొంతమంది వాటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచుతారు. దీనికి బదులుగా వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉండడంతో పాటు అందులోని పోషకాలు తరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.
కొన్ని వంట పాత్రలు ఎంత శుభ్రం చేసినా వాటి నుంచి వచ్చే దుర్వాసన పోదు. ఇలాంటప్పుడు ఒక టబ్‌లో నీళ్లు పోసి అందులో కొంచెం వినెగర్ కలపాలి. వాటిలో వంట పాత్రలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే శుభ్రం చేస్తే పాత్రల దుర్వాసన మాయం
అవుతుంది.
చెక్కతో చేసిన చాపింగ్ బోర్డ్ కొన్ని సందర్భాల్లో అదో రకమైన వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు బోర్డ్ రాక్ సాల్ట్ వేసి పావుగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత అర చెక్క నిమ్మకాయతో రుద్ది కడిగితే ఫలితం ఉంటుంది.
చెక్కతో తయారు చేసిన స్పూన్లకు అంటుకున్న పసుపు మరకలు, నూనె జిడ్డు అంత సులభంగా వదలవు. ఇలాంటప్పుడు వాటిని కొద్ది సేపు వేడి నీళ్లలో మరిగించి, ఆపై శుభ్రం చేసి.. ఎండలో ఆరబెడితే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.