Karun Nair | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ నెల 19 నుంచి ఐసీసీ ఈవెంట్ పాక్, దుబాయి వేదికగా జరుగనున్నది. మినీ ప్రపంచకప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో పలు మార్పులు చేసి 15 మంది తుది జట్టును ప్రకటించింది. ఈ సమయంలోనూ రంజీల్లో రాణించిన కరుణ్ నాయర్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ స్పందించాడు. ఇటీవల భారత జట్టు కెప్టెన్‌తో పాటు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సైతం చాంపియన్స్ ట్రోపీ, ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన సమయంలో మీడియా కరుణ్ నాయర్ గురించి ప్రశ్నించింది. ఈ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కరుణ్ నాయర్‌ను ప్రశంసించాడు. దేశవాళీ క్రికెట్ అద్భుతంగా రాణించాడని అభినందించాడు. కానీ, బ్యాట్స్‌మెన్‌ను టాప్ ఆర్డర్లో తీసుకోవడం కష్టమని చెప్పాడు.
ఇలాంటి ప్రదర్శనలు తరచుగా జరిగేవి కావని.. జట్టులో 15 మందికే అవకాశమని.. ఎక్కువగా తీసుకోలేమని చెప్పాడు. తాజాగా దీనిపై కురుణ్ నాయర్ స్పందించాడు. అగార్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు. ఆటగాడిగా తాను ఎక్కడికి వెళ్లాలి.. ఏమీ చేయాలో అర్థం చేసుకోవడం సులభమవుతుందన్నారు. ప్రస్తుతానికి తన దృష్టంతా రంజీ ట్రోఫీని గెలువడంపైనే ఉందన్నాడు. నాయర్ దేశీయ క్రికెట్లో ఇటీవల అదరగొడుతున్నాడు. 2017లో భారత్ తరఫున చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఏడు మ్యాచుల్లో 752 పరుగులు చేశాడు. రంజీలో విదర్భ తరపున అద్భుతంగా రాణించి జట్టును సెమీ ఫైనల్ వరకు చేర్చాడు. తమిళనాడుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భను 198 పరుగుల తేడాతో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.