Virat Kohli | ప్రపంచంలోని ఏ పిచ్‌పై అయినా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ప్రత్యర్థులు ఎంతటి మొనగాౖళ్లెనా.. ఒక్కసారి విరాట్ బరిలోకి దిగితే లెక్కలు మారిపోవాల్సిందే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఇలా ప్రతి పిచ్‌పైనా భారీగా పరుగులు చేసిన కోహ్లీకి శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియం అంటే ప్రేమెక్కువ! అతడి గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తాయి.
ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగింట సెంచరీలు బాదాడు. అందులో మూడు సార్లు నాటౌట్‌గా నిలువడం కొసమెరుపు. తొలిసారి 2012లో ఈ మైదానంలో లంకతో మ్యాచ్ ఆడిన కోహ్లీ 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత 2017లో లంకపైనే 131 పరుగులు చేశాడు. అదే సంవత్సరం లంకపై 110 పరుగులతో అజేయ శతకం ఖాతాలో వేసుకోగా.. తాజాగా ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో కోహ్లీ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఆరంభంలో నిధానంగా ఆడినట్లు కనిపించిన విరాట్ చాప కింద నీరులా పరుగులు పిండుకున్నాడు. పాకిస్థిన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన అప్రతిహత శతకాల జోరు కొనసాగించాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 122 పరుగులు సాధించాడు. అతడితో పాటు గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా (106 బంతుల్లో 111 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతక్కొట్టడంతో టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
* భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 47వ వన్డే సెంచరీ. కాగా.. ఈ ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ (49) తర్వాత కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెరో 30 శతకాలతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు.
* ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనత సాధించడానికి కోహ్లీ 267 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరాడు.
* వన్డేల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్ అజేయ శతకాలతో భారత్ 356 పరుగులు చేయగా.. గతంలో (2005) విశాఖపట్నం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ 9 వికెట్లు కోల్పోయి సరిగ్గా 356 పరుగులే చేసింది.
* పాకిస్థాన్‌పై వన్డేల్లో భారత్ తరఫున మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు 233* జోడించిన ప్లేయర్లుగా కోహ్లీ, రాహుల్ నిలిచారు. గతంలో (1996) ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు (231) పేరిట ఉంది.