టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. మరికొంత కాలం జట్టుకు నాయకత్వం వహించే సత్తా కోహ్లీకి ఉందని అతను అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిగా కోహ్లీని చాలా దగ్గర నుంచి పరిశీలించిన వారిలో భరత్ అరుణ్ కూడా ఒకడు.
టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై తాజాగా భరత్ అరుణ్ స్పందించాడు. తనతో ఎప్పుడు మాట్లాడినా కెప్టెన్సీ విషయంలో కోహ్లీ చాలా ప్యాషనేట్‌గా ఉండేవాడని, ప్రపంచంలో భారత జట్టును ఒక బలమైన శక్తిగా నిలపాలనే కోరిక వెలిబుచ్చేవాడని భరత్ అరుణ్ అన్నాడు. దీనికి కావలసిన ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశాడని మెచ్చుకున్నాడు.
భారత జట్టు సారధి పదవిని దేశప్రధానితో పోల్చాడీ మాజీ బౌలింగ్ కోచ్. ‘నేను ధోనీని చూశా. అతను చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఏం జరిగినా అతను చలించడు. ముందుకెళ్లే కొద్దీ మనం నిర్ణయాలు తీసుకోవాలి. దేశ ప్రధాని తర్వాత అందరూ ఆశించే పదవి టీమిండియా కెప్టెన్ పదవే’ అన్నాడు.
కోహ్లీ మరికొంత కాలం జట్టుకు నాయకత్వం వహిస్తాడని తాను అనుకున్నానని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ తర్వాత తను టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.