CWC | చేజింగ్ మాస్టర్ కోహ్లీ వరల్డ్‌కప్‌లో తొలిసారి ఛేదనలో సెంచరీ చేసిన వేళ! అచ్చొచ్చిన పుణె పిచ్‌పై రోహిత్, గిల్ రఫ్ఫాడించిన సమయాన!! బౌలర్లు సమిష్టిగా కదం తొక్కి బంగ్లా పులుల పొగరు అణచిన తరుణాన!! స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది.
చిన్న జట్టు కదా అని ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వని.. రోహిత్ సేన సాధికారిక విజయంతో సెమీ ఫైనల్ దిశగా మరో ముందడుగు వేసింది. జడేజా, బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఓ మాదిరి స్కోరు చేసిన బంగ్లా.. భారత స్టార్ల ముందు ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. రాహుల్, జడేజా స్టన్నింగ్ క్యాచ్‌లతో ఆకట్టుకుంటే.. బంతిని అడ్డుకోబోయిన హార్దిక్ గాయపడి మైదానం వీడాడు!
పుణె: అద్భుత బౌలింగ్‌కు అంతకుమించిన ఫీల్డింగ్ తోడవడంతో.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వీరవిహారం చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుకొని పుణెలో అడుగుపెట్టిన రోహిత్ సేన గురువారం జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్ఇండియా.. సెమీఫైనల్ దిశగా మరో ముందడుగు వేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తన్జీద్ హసన్ (51; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిటన్ దాస్ (66; 7 ఫోర్లు) అర్ధశతకాలు సాధించగా.. సీనియర్ ప్లేయర్ మహ్ముదుల్లా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 93/0తో పటిష్ట స్థితిలో కనిపించిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల జోరుతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. షకీబ్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించిన నజ్ముల్ హసన్ (8), మెహదీ హసన్ మిరాజ్ (3), తౌహిద్ (16), నసుమ్ (14) విఫలమయ్యారు. భారత బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్ (53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (48; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (34 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహదీ 2 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఓ మోస్తరు లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్, గిల్ దంచికొట్టడంతో పరుగుల వరద పారింది. వీరిద్దరూ వంతులు వేసుకున్నట్లు ఒకరి తర్వాత ఒకరు బౌండ్రీలతో రెచ్చిపోతుంటే.. బంగ్లా ప్లేయర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించాక.. తనకు ఇష్టమైన పుల్ షాట్ ఆడుతూ రోహిత్ బౌండ్రీ వద్ద ఫీల్డర్ చేతికి చిక్కగా.. వచ్చి రాగానే వరుసగా రెండు నోబాల్స్ ఎదుర్కొన్న కోహ్లీ మ్యాచ్ ముగించి తిరిగి వచ్చేంత వరకు ఒకే తీవ్రతతో పరుగులు రాబట్టాడు. అర్ధశతకం తర్వాత గిల్ ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (19) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. రాహుల్‌తో కలిసి విరాట్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
ఒక దశలో కోహ్లీ సెంచరీ కష్టమే అనిపించింది. మరో ఎండ్ నుంచి రాహుల్ కూడా భారీ షాట్లు ఆడుతుండటంతో కోహ్లీకి మూడంకెల మార్క్ దాటే అవకాశం రాకపోవచ్చని అంతా భావించారు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆనవాయితీగా మలుచుకున్న కోహ్లీ దాన్ని చేతల్లో చేసి చూపాడు. 36 ఓవర్లు ముగిసే సరికి భారత విజయానికి 48 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ 68 పరుగులతో నిలిచాడు. ఈ దశలో రాహుల్ 6,4 బాదగా.. ఆ తర్వాత నుంచి కోహ్లీ ఎక్కువ స్ట్రయికింగ్ తీసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మహమూద్ ఓవర్లో సిక్సర్‌తో 81 మీదకు వచ్చిన కోహ్లీ.. నసుమ్ ఓవర్లో 4,6తో తొంభైల్లో అడుగుపెట్టాడు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది సెంచరీతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ఫీల్డింగ్‌తో కట్టి పడేసింది. సిరాజ్ వేసిన 25వ ఓవర్లో మెహదీ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ రాహుల్ ఎడమ వైపు దూకుతూ రెప్ప పాటులో అందుకోగా.. జడేజా సూపర్ క్యాచ్‌తో ముష్ఫికర్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా వేసిన బంతిని ముష్ఫికర్ కట్ చేసే ప్రయత్నం చేయగా.. బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడ్డూ.. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా సచిన్ (34,357), సంగక్కర (28016), రికీ పాంటింగ్ (27,483) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా కోహ్లీ (26,026)నిలిచాడు.
టోర్నీలో మా ఫీల్డింగ్ బాగుంది. ఈ మ్యాచ్‌లోనూ ప్లేయర్లంతా చక్కటి ప్రదర్శన కనబర్చారు. జడేజా అటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి అద్భుత క్యాచ్ అందుకున్నా.. అంతర్జాతీయ మ్యాచ్‌లో వంద.. వందే అవుతుంది. సెంచరీకి ఉన్న గొప్పదనం అది. వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్ సమానమే. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నాం.
-రోహిత్, భారత కెప్టెన్
పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా.. బంతిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డాడు. లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను అడ్డుకునే క్రమంలో పాండ్యా ఎడమ కాలు మడత పడింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిన పాండ్యా.. ఓవర్ పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. వైద్య బృందం అతడిని స్కాన్‌కు తరలించగా.. ఫలితాలు వచ్చిన తర్వాతే పాండ్యా పరిస్థితిపై స్పష్టత వస్తుందని మ్యాచ్ అనంతరం రోహిత్ వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. దాదాపు ఆరేండ్ల తర్వాత విరాట్ అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. గాయం కారణంగా పాండ్యా మైదానాన్ని వీడటంతో ఆ ఓవర్‌ను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చి ఫ్యాన్స్ మది దోచాడు.
స్వదేశంలో టీమ్ఇండియా జోరు కొనసాగుతున్నది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు టాపార్డర్ దంచుడు తోడవడంతో వరల్డ్‌కప్‌లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. మెగాటోర్నీలో ఇప్పటికే రోహిత్ ఓ సెంచరీ తన పేరిట రాసుకోగా.. ఈ పోరులో కోహ్లీ ఆ ముచ్చట తీర్చుకున్నాడు. 2011లో తొలిసారి బంగ్లాపైనే వరల్డ్‌కప్ సెంచరీ నమోదు చేసుకున్న కోహ్లీ.. ఈ సారి ఛేదనలో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఆకలితో ఉన్న సింహం ముందు మేక పిల్లను వదిలినట్లు.. పరుగుల ఘోరాకలితో ఉన్న కోహ్లీకి క్రీజులో అడుగుపెట్టగానే రెండు నోబాల్స్ ఎదురయ్యాయి. మామూలుగానే బంగ్లాదేశ్ అంటే చిర్రెత్తుకుపోయే కోహ్లీ.. ఇలా అప్పనంగా వచ్చిన అవకాశాన్ని వదులుతాడా! తొలుత వికెట్ల మధ్య పరిగెడుతూ రెండు రన్లు తీసిన కోహ్లీ ఆ తర్వాత రెండు ఫ్రీ హిట్లను వరుసగా 4,6 బాదాడు. ఇక మెరుపు ఆరంభం లభించాక ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోని మాజీ కెప్టెన్.. తనకు అలవాటైన రీతిలో ఒక్కో పరుగు తీస్తూ చాపకింద నీరులా స్కోరు పెంచాడు. బౌలర్లందరినీ ఓ ఆటాడుకుంటూ.. బంతికో పరుగు చొప్పున ముందుకు సాగిపోయాడు. ఈ క్రమంలో 48 బంతుల్లో 69వ అంతర్జాతీయ అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత వేగంగా ఆడుతూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ 48 సెంచరీలతో గురువును సమీపించాడు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే.. మెగాటోర్నీలోనే మాస్టర్‌ను మించిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 256/8 (లిటన్ దాస్ 66, తన్జీద్ 51; జడేజా 2/38, బుమ్రా 2/41), భారత్: 41.3 ఓవర్లలో 261/3 (కోహ్లీ 103 నాటౌట్, గిల్ 53; మెహదీ 2/47).