భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది! ఆటగాళ్ల సత్తాకు సవాల్ విసురుతూ వారిని నిత్యం పరీక్షించే టెస్టులలో బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు చిరునామాగా మారి ఆధునిక క్రికెట్లో ‘లెజెండ్’గా వెలుగొందుతున్న కోహ్లీ.. ‘ఇక సెలవు’ అని ప్రకటించాడు. భారత క్రికెట్‌ను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపిన ఈ పరుగుల యంత్రం విన్యాసాలు.. ఇక వన్డేలు, ఐపీఎల్‌ల్లో మాత్రమే కొనసాగనున్నాయి.
ఢిల్లీ: క్రికెట్లో అత్యుత్తమ ఫార్మాట్ అయిన టెస్టుల్లో తన నాయకత్వ ప్రతిభతో భారత క్రికెట్ జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన వీరుడు, టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. పదిహేనేండ్లుగా భారత క్రికెట్ ముఖచిత్రంగా ఉన్న కోహ్లీ.. తనకెంతో ఇష్టమైన ఐదురోజుల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరికొద్దిరోజుల్లో ఇంగ్లండ్ వేదికగా ఆ జట్టుతో జరుగబోయే కీలకమైన ఐదు టెస్టుల సిరీస్‌కు ముందే వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశాడు. కొద్దిరోజుల క్రితమే టెస్టుల నుంచి తప్పుకొంటానని బీసీసీఐకి సమాచారమిచ్చిన విరాట్.. మంగళవారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఇటీవలే రెడ్‌బాల్ క్రికెట్‌కు మాజీ సారథి రోహిత్ శర్మ వీడ్కోలు పలకగా తాజాగా కోహ్లీ కూడా అతడినే అనుసరించడంతో ఇంగ్లండ్ సిరీస్‌లో భారత జట్టు ఈ ద్వయం లేకుండానే బరిలోకి దిగనుండటం గమనార్హం.
2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా తొలిసారిగా భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో శతాధిక (123) టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ 30 శతకాలు, 31 అర్ధ శతకాలు సాధించాడు. కోహ్లీ ఖాతాలో ఏడు ద్విశతకాలుండగా అత్యధిక స్కోరు 254 నాటౌట్‌గా ఉంది. బ్యాటర్‌గానే గాక సారథిగానూ అతడు సూపర్ హిట్.
నాయకుడిగా కోహ్లీ టీమిండియాను 68 టెస్టులలో నడిపించాడు. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 68 టెస్టులాడి ఏకంగా 40 విజయాలు సాధించింది. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆడిన టెస్టే ఆఖరిది. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకొన్న కోహ్లీ.. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పాడు. ఈ రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగినా కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని కల్పించిన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నాడు.
రిటైర్మెంట్పై కోహ్లీ ప్రకటన సారాంశం..
‘14 ఏండ్ల క్రితం తొలిసారి ఈ నీలి రంగు క్యాప్‌ను ధరించా. ఈ ఫార్మాట్ నన్ను ఇక్కడిదాకా తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలను నేర్పించింది. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రత్యేకమైంది. సుదీర్ఘమైన రోజులు, నిశ్శబ్ద ఆటతీరు ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు ఎల్లకాలం నాతోనే ఉంటాయి. అటువంటి ఈ ఫార్మాట్ నుంచి వైదొలగడం అంత తేలిక కాదు. కానీ నా నిర్ణయం సరైందే అనిపిస్తున్నది.
ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చా. అదీ నాకు అంతకంటే ఎక్కువే తిరిగిచ్చింది. మనస్ఫూర్తిగా, పూర్తి కృతజ్ఞతా భావంతో ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. క్రికెట్‌కు, నా తోటి ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా తోడ్పడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా టెస్టు కెరీర్ సంతృప్తికరం. ఇక సెలవు’ అంటూ భావోద్వేగ లేఖతో కోహ్లీ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.