పెర్త్: భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మదిని దోచుకున్న విరాట్‌కు ఆస్ట్రేలియా గడ్డపై వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గింది. అభిమానం హద్దులు మీరిన క్షణాన అసలు ఏం చేస్తున్నామో అన్న సంగతి మరిచిపోయి గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలోపోస్ట్ చేసిన వీడియో వివాదానికి కారణమైంది.
టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం బస చేసిన ‘క్రౌన్ పెర్త్’ హోటల్లో ఇది చోటు చేసుకుంది. హోటల్ సిబ్బంది చేసిన నిర్వాకం కోహ్లీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘కింగ్ కోహ్లీ హోటల్ రూమ్’ అంటూ సోషల్‌మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇందులో మరోకరితో కలిసి హోటల్లో అన్ని రూమ్‌లు కలియతిరుగుతూ విరాట్ వాడే వస్తువులను చిత్రీకరించాడు.
ఫిట్నెస్ కోసం వాడే సప్లిమెంట్లు, కోహ్లీ ధరించే షూస్, గ్లాసెస్, కాస్మెటిక్స్, ఓపెన్ చేసిన బ్యాగ్‌లో కనిపిస్తున్న జెర్సీలు, ఆఖరికి వాష్‌రూమ్‌ను కూడా వదిలిపెట్టకుండా తీసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘తమ అభిమాన క్రికెటర్లను చూడటం, కలుసుకోవడం కోసం ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాన్ని నేను ఎప్పుడూ సమర్థిస్తాను. కానీ ఈ వీడియో నా వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కల్గించేలా ఉంది.
నా హోటల్ గదిలో నాకే ప్రైవసీ లేకపోతే ఇంక ఎక్కడ ఆశించగలను. ఒక విధంగా స్వేచ్ఛను హరించేలా ఉన్న ఇలాంటి చర్యను నేను సమర్థించను. వ్యక్తుల గోప్యతను గౌరవించండి అంతేగానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్కాకండి’ అని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీకి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మద్దతుగా నిలిచాడు. ‘ఇది తెలివితక్కువ చర్య. ఎంతమాత్రం సహించదగినది కాదు. క్రౌన్ పెర్త్లోనేనా ఇది జరిగింది?’ అని రాసుకొచ్చాడు.
హోటల్ సిబ్బందిపై వేటు:
విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కల్గించిన సిబ్బందిపై క్రౌన్ పెర్త్ హోటల్ యాజమాన్యం చర్యలకు దిగింది. తమ హోటల్ అతిథి గోప్యతను భంగపరిచిన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. వెంటనే దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ‘మా అతిథుల భద్రత, ప్రైవసీ మా తొలి ప్రాధాన్యం. ఈ ఘటన పట్ల చాలా నిరుత్సాహంగా ఉన్నాం. మా సిబ్బంది నిర్వాకం పట్ల విరాట్ కోహ్లీకి భేషరతుగా క్షమాపణ చెబుతున్నాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
అభిమానానికి హద్దు ఉంటుంది. తమ ఆరాధ్య ప్లేయర్లను కలిసేందుకు అందరూ ఇష్టపడుతారు. వారి ఉత్సాహాన్ని అర్థం చేసుకోగల్గుతాం. కానీ ఇది ఒక పరిమితి వరకే భరించగలం. అందరిలాగే సెలెబ్రిటీలకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. హోటల్ గదిలో దృశ్యాలు కూడా బయటికి వస్తే వ్యక్తిగత గోప్యతకు ఆస్కారం ఎక్కడిది. ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైతే తెలుస్తుంది. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా హోటల్ రూమ్ వ్యవహారం బయటికి రావడం బాధ కల్గిస్తున్నది.
-అనుష్కశర్మ