Virat Kohli : భారత్ (India), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy) ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి గాయమైంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొంటున్న కోహ్లీ మోకాలి కింది భాగంలో బంతి బలంగా తగిలింది. దాంతో ఆయన ప్రాక్టీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
వెంటనే టీమ్ ఫిజియో బృందం కోహ్లీకి గాయమైన చోట నొప్పిని తగ్గించే స్ప్రే కొట్టి, బ్యాండేజీ వేశారు. గాయం కొంచెం బాధిస్తున్నప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ ముగిసేవరకు పరిశీలిస్తూ గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గాయం పెద్దగా నొప్పేం లేదని తన టీమ్‌మేట్స్‌కు, టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌కు కోహ్లీ చెప్పడం కనిపించింది. ఆ తర్వాత భారత్ కోచింగ్ సిబ్బంది కోహ్లీ గాయంపై క్లారిటీ ఇచ్చారు.
కోహ్లీకి తగిలింది తీవ్ర గాయమేమీ కాదని, ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడని కోచింగ్ సిబ్బంది స్పష్టం చేశారు. కాగా, ఫైనల్లో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లలో భారత్-న్యూజిలాండ్ 16 మ్యాచ్‌లలో తలపడగా అందులో న్యూజిలాండ్ 10-6 తేడాతో ఆధిక్యంలో ఉంది. దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.