కొంతకాలంగా ఫామ్‌లో లేక, భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు జూలువిదిల్చాడు. ఆసియా కప్‌లో అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఈ టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగాడు. అతని 71వ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఊహించని సర్ప్రయిజ్ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే అతని టీ20 బ్యాటింగ్ ర్యాంక్ మెరుగైంది. ఫామ్ లేమి కారణంగా టాప్-20లో స్థానం కోల్పోయిన కోహ్లీ.. ఆసియా కప్‌లో రాణించడంతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే 14 స్థానాలు జంప్ చేసి 15వ ర్యాంకు చేరుకున్నాడు. టీమిండియా సారధి రోహిత్ శర్మ 606 పాయింట్లతో 14వ ర్యాంకులో ఉండగా.. కోహ్లీ 599 పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.
భారత బ్యాటర్లలో కేవలం సూర్యకుమార్ యాదవ్ (4వ ర్యాంకు) మాత్రమే టాప్-10లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీసుల్లో రాణిస్తే కోహ్లీ ర్యాంకు మరింత మెరుగయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న భువనేశ్వర్ కుమార్ కూడా తన ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతను టీ20 బౌలర్లల ర్యాంకింగ్‌లో 7వ స్థానానికి చేరుకున్నాడు.