హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ టూర్లో మరో టెస్టు అయినా ఆడేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడులో తనకు విరాట్ కోహ్లీనే ఆదర్శమని మియాభాయ్ చెప్పుకొచ్చాడు. ఐదు మ్యాచ్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్.. ఒక్క టెస్టు కూడా మిస్ కాకుండా ఏకంగా 185.3 ఓవర్లు వేసి 23 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న విషయం విదితమే.
ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్‌లో మరో టెస్టు అయినా ఆడేవాడిని. అందులో సందేహమే లేదు. టెస్టు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫార్మాట్ కోసం ఏమైనా చేస్తా. ఒక క్రికెటర్లోని సమర్థతకు టెస్టు క్రికెట్ అసలైన పరీక్ష.
జీవితంలో మాదిరిగానే టెస్టుల్లోనూ మరో అవకాశం ఉంటుంది. ఒక ఇన్నింగ్స్‌లో చెత్త స్పెల్ వేసినా దాన్ని మరో ఇన్నింగ్స్‌లో సరిదిద్దుకోవచ్చు. కోహ్లీ నుంచే పోరాటపటిమ నేర్చుకున్నాను. ప్రత్యర్థులను మైదానంలో శత్రువులుగా, బయట స్నేహితులుగా చూడటం అతని నుంచే అలవర్చుకున్నా’ అని అన్నాడు. ఇంగ్లండ్ టూర్లో అలసట లేకుండా ఆడటంపై సిరాజ్ స్పందిస్తూ.. ‘నిజంగా చెప్పాలంటే ఆ సీక్రెట్ ఏంటో నాక్కూడా తెలియదు. కానీ దేశం కోసం ఆడుతున్నప్పుడు మన దేహం గురించి ఆలోచించాల్సిన పన్లేదు. నాలాంటివారికి చిన్నప్పట్నుంచీ దేశం తరఫున ఆడాలని బలమైన కోరిక ఉంటుంది. అలాంటి అవకాశమొచ్చినప్పుడు దానిని రెండు చేతులా ఒడిసిపట్టుకోవాలి’ అని తెలిపాడు.