హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఆ ఫార్మాట్లో అనితరసాధ్యుడు అనిపించుకున్నాడు. సంప్రదాయ క్రికెటర్ల తరహాలో కాకుండా.. చాలా ధైర్యవంతుడి తరహాలో అతను టెస్టు క్రికెట్‌ను ఆడాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఇండియన్ క్రికెట్లో ప్రభావంతమైన బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ పేరు తెచ్చుకున్నాడు. భారత జట్టు టెస్టు పోకడనే మార్చేశాడతను. భారతీయ క్రికెటర్ల సైకాలజీపై ప్రభావాన్ని చూపిన క్రికెటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. దశాబ్ద కాలంలో అతను కేవలం పరుగులు మాత్రమే పారించలేదు.. క్రికెట్ అభిమానుల్లో అతను ఆశల్ని పెంచాడు. బ్యాటింగ్‌లో సంప్రదాయ విధానాలను సవాల్ చేశాడు. కొత్త తరహా టీమిండియాను తయారు చేయడంలో సఫలం అయ్యాడు. టెస్టు ఫార్మాట్‌ను విరాట్ వీడడం అది జట్టుకు కొంత లోటే. బ్యాటింగ్ సగటుతో దుమ్మురేపిన కోహ్లీ లాంటి మరో బ్యాటర్ టెస్టుల్లో ఎవరూ లేరని చెప్పవచ్చు.
నిజానికి ఒకప్పుడు భారత క్రికెటర్లు ఎక్కువగా టెక్నికల్ స్కిల్‌తో మాత్రమే ఆడేవారు. సైకాలజీ విషయానికి వస్తే వారిలో కొంత ఆత్మనూన్యత ఉండేది. కానీ కోహ్లీ ఎంట్రీతో టెస్టు క్రికెట్లో ఇండియన్ గేమ్ స్టయిల్ మారిపోయింది. గంగూలీ, ధోనీ కెప్టెన్లుగా తమదైన స్టయిల్లో రాణించగా.. కోహ్లీ మాత్రం అగ్నిశిఖలాగా భారతీయ టెస్టు క్రికెట్లో జోష్‌ను పెంచేశాడు. విదేశీ పిచ్‌లపై విరుచుకుపడే ఆటను అతను ప్రదర్శించాడు. విదేశీ గడ్డలపై కూడా ఈజీగా గెలవవచ్చు అని నిరూపించాడు. దేన్నీ వదిలేది లేదన్న స్టయిల్లో అతను గ్రౌండ్లో ఆడేవాడు. ఇంకా ఇంకా కావాలన్న కసితో అతను పర్ఫార్మ్ చేసేవాడు.
కోహ్లీ కెరీర్‌ను రెండు సిరీస్‌లు మార్చేశాయి. అతని క్యారెక్టర్ ఏంటో కూడా ఆ సిరీస్‌ల్లో తెలిసిపోయింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కోహ్లీ ఓ కొత్త తేజంలా మెరిశాడు. క్రికెట్లో ధీటైన ఆ రెండు జట్లకు టఫ్ ఫైట్ ఇచ్చాడతను. 2014 సిరీస్‌లో ఇండ్లండ్ బౌలర్ అండర్సన్ తన లేట్ స్వింగ్‌తో కోహ్లీని ఇబ్బందిపెట్టాడు. వాస్తవానికి ఆ సీజన్లో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అతను బలోపేతం అయ్యాడు. టెక్నికల్ లోపాలను సరిదిద్దుకుని మళ్లీ రాణించాడు. బెస్ట్ బ్యాటర్‌గానే కాకుండా బెటర్ బ్యాటర్‌గా ఎదిగాడు. 2018లో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను దుమ్మురేపాడు. ఎడ్జ్బెస్టన్లో జరిగిన టెస్టులో 149 రన్స్ స్కోర్ చేశాడు. సహనాన్ని పెంచుకున్నాడు, తన నైపుణ్య విద్యలను ప్రదర్శించాడు. ఆ సిరీస్‌లో అతను 5 టస్టుల్లో 59 సగటుతో మొత్తం 593 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ కోహ్లీ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియాలో అప్పటి వరకు ఇండియా టెస్టు సిరీస్ నెగ్గలేదు. కానీ కోహ్లీ ఆ రికార్డును చెరిపేశాడు. ఆ సిరీస్‌లో నిజానికి పూజారా హీరో అయినా.. పెర్త్ మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ 123 రన్స్ చేశాడు. ఆ సిరీస్‌ను ఇండియా 2-1 తేడాతో సొంతం చేసుకున్నది. అప్పటి వరకు ఆత్మనూన్యతలో ఉన్న ఇండియన్ క్రికెట్ ఒక్కసారిగా విరోచిత బాటను అందుకున్నది.
విదేశీ పిచ్‌లపై ఇండియాను ఆధిపత్య పథంలో నడిపాడు కోహ్లీ. సచిన్ తర్వాత విదేశీ పిచ్‌లపై రాణించిన మేటి బ్యాటర్‌గా కోహ్లీ అగ్రపథంలో ఉన్నాడు. వివిధ దశల్లో కోహ్లీ తన సత్తాను చాటిన తీరు కూడా హైలెట్. 2014 అడిలైడ్ టెస్టుల్లో 141 రన్స్, 2018 సెంచరీయిన్లో 153 రన్స్, 2016 వెస్టిండీస్‌లో 200 రన్స్, దక్షిణాఫ్రికాతో 254 నాటౌట్ ఇన్నింగ్స్‌లు.. కోహ్లీ టెస్టు కెరీర్లో ప్రత్యేకమైనవి. బలమైన షాట్లు ఆడడమే కాదు.. వాటిని టైమింగ్‌లో కొట్టేవాడు. బరువైన బ్యాట్లు కాదు.. స్ట్రయిట్ డ్రైవ్‌లతో అలరించేవాడు. పెద్దగా ఇన్నోవేటివ్ స్ట్రోక్స్ ఏమీ ఆడలేదు. స్కూప్‌లు, రివర్స్ స్వీప్‌లు ఎక్కువగా లేదు. క్లాసికల్ క్రికెట్ బ్యాటింగ్‌ను.. విరాట్ విరోచిత శైలిలో ఆడేవాడు.
ప్రొఫెషనల్ క్రికెట్‌కు ప్రత్యామ్నాయంగా కోహ్లీ నిలిచాడు. శారీరకంగా అతను ఫిట్నెస్ అందర్నీ స్టన్ చేసింది. మానసికంగా కూడా అతను ఓ ఇనుప ఖనిజం అన్న రీతిలో మైదానంలో ఉండేవాడు. ఇండియన్ టెస్టు క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఓ జీనియస్, ధోనీ ఓ వ్యూహాకర్త, ఆ రేంజ్‌లోనే కోహ్లీ భారతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావంతమైన బ్యాటర్‌గా నిలిచిపోయాడు. క్రికెట్ ఫలితాలనే కాదు.. క్రికెటర్ల మైండ్‌సెట్‌ను కూడా అతను మార్చేశాడు.
టెస్టుల్లో అతను 9 వేల రన్స్ చేశాడు. 30 సెంచరీలు ఉన్నాయి. ఆ రికార్డుతో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు కోహ్లీ. అతని గుండె ధైర్యం, పరుగుల దాహం, పట్టువదలని క్రీడా స్పూర్తి .. కోహ్లీకి ప్రత్యేకమైనవి. కోహ్లీ నిజంగా కింగే. హుందాగా ఆడుతూనే అతను ఆ ఫార్మాట్‌ను డామినేట్ చేసిన తీరు.. క్రికెట్ హిస్టరీలోనే ఓ కొత్త అధ్యాయంగా నిలిచిపోతుంది.