ఇటీవల భారత టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీపై మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు కాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో ఎంఎస్ ధోనీ తొలి స్థానంలో ఉంటాడన్న మంజ్రేకర్.. ఆ తర్వాత కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ వంటి వాళ్లు ఉంటారన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న సమయంలో కపిల్ దేవ్ ఆ అడ్డుకట్టను దాటేందుకు ఎంతో కృషి చేశాడని మెచ్చుకున్నాడు.
అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత సౌరవ్ గంగూలీ కూడా జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడన్నాడు. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అతను అత్యుత్తమ సారధి అని కొనియాడాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే చివరి వరకూ పోరాడే తత్వాన్ని జట్టులో తీసుకొచ్చాడని మెచ్చుకున్న మంజ్రేకర్.. ఫలితాల విషయంలో మాత్రం కోహ్లీ వెనకడుగు వేశాడని పెదవి విరిచాడు.
ఉదాహరణకు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చివరి బంతి వరకూ భారత్ పోరాడిందని, ఈ పోరాటంలో కోహ్లీ ముందుండి జట్టును నడిపించాడని అన్నాడు. కానీ చివరకు భారత్ ఓడిపోయిందని, ఫలితాలే ముఖ్యమని పేర్కొన్నాడు.