దుబాయ్: ఫామ్ లేమితో సతమతమైన సమయంలో జట్టు నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన మ్యాచ్లో విరాట్ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దాదాపు మూడేండ్ల తర్వాత కోహ్లీ మూడంకెల స్కోరు అందుకోగా.. పొట్టి ఫార్మాట్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్కిచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడాడు. ‘ఇన్నాళ్ల తర్వాత టీ20ల్లో సెంచరీ చేస్తానని ఊహించలేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే ప్రపంచకప్ కోసం మేం సిద్ధమవుతున్నాం. ఓడిన మ్యాచ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.