Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు తొలి ట్రోఫీ అందించిన విరాట్.. ఇక టీమిండియా జెర్సీలో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. టీ20లకు.. ఈమధ్యే టెస్టులకు వీడ్కోలు పలికిన కింగ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కోసం ప్రాక్టీస్ మొదలెట్టాడు. లండన్‌లో ఉంటున్న అతడు.. అక్కడే ఐపీఎల్ కోచ్‌తో కలిసి బ్యాటింగ్ సాధనకు ఉపక్రమించాడు. శుక్రవారం కోహ్లీ కోచ్‌తో దిగిన ఫొటో పెట్టాడు.
తన ఆటతో కోట్లాదిమందిని అభిమనులుగా మార్చుకున్న కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఎదురుచూస్తున్నాడు. వన్డే స్క్వాడ్‌లో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్న నయీం అమిన్ (Naeem Amin) సాయం తీసుకుంటున్నాడు కోహ్లీ. నెరిసిన గడ్డం, బూడిద రంగు టీషర్ట్, బ్లూ షార్ట్‌తో విరాట్.. నవ్వులూ చిందిస్తూ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
‘బ్యాటింగ్ సలహాలు ఇస్తున్నందుకు బ్రదర్ నీకు ధన్యవాదాలు. నిన్ను కలవడం ఎల్లప్పుడూ గొప్పగా ఉంటుంది’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడీ రన్ మెషీన్. లండన్‌లోనే నెట్స్ ప్రాక్టీస్ షురూ చేసిన విరాట్.. నయీం పర్యవేక్షణలో మునపటి లయను అందుకునేందుకు కఠోర సాధన చేయనున్నాడు.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వేళ జట్టు సభ్యులతో కోహ్లీ సంబురం
ఐపీఎల్ 18వ సీజన్‌తో తన ట్రోఫీ కలను సాకారం చేసుకున్న విరాట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తనకెంతో ఇష్టమైన టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ బాంబ్ పేల్చిన అతడు.. వన్డేల్లో తళుక్కుమనేందుకు కాచుకొని ఉన్నాడు. అక్టోబర్‌లో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour) కు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకూ జరుగబోయే ఈ సిరీస్‌పై కన్నేసిన కోహ్లీ ఫామ్ చాటుకునేందుకు తహతహలాడుతున్నాడు.