నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : 2012లో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ స్థాయిలో వందో శతకం సాధించిన సందర్భంగా క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి ముంబైలో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీకి యాంకర్‌గా వ్యవహరించిన సల్మాన్ ఖాన్.. మాస్టర్ బ్లాస్టర్‌తో ‘సచిన్.. సమీప భవిష్యత్‌లో మీ రికార్డులను ఎవరైనా అధిగమించగలరా?’ అని ప్రశ్నించాడు. దానికి సచిన్ స్పందిస్తూ.. ‘ఇక్కడే ఈ గదిలోనే కొంతమంది కుర్రాళ్లు నా రికార్డులను బ్రేక్ చేయాలని ఆశిస్తున్నా.
విరాట్, రోహిత్‌కు ఆ సత్తా ఉంది’ అని అన్నాడు. అప్పటికీ రోహిత్, కోహ్లీ (రోకో) భారత జట్టులో పూర్తిస్థాయిలో కూడా కుదురుకోలేదు. సచిన్ చెప్పినట్టుగా రోకో ద్వయం లిటిల్ మాస్టర్ నెలకొల్పిన అన్ని రికార్డులనూ బ్రేక్ చేయనప్పటికీ గడిచిన పదిహేనేండ్ల కాలంలో ఈ ఇద్దరూ లేని భారత క్రికెట్‌ను ఊహించడం కష్టం. టీమ్ఇండియాలోకి వీరి ఆగమనం కూడా దాదాపు నెలల వ్యవధిలోనే జరిగింది. దశాబ్దంన్నరగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన రోకో.. టీ20లతో పాటు టెస్టుల నుంచి ఏకకాలంలో తప్పుకోవడం సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేనిదనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వన్డేలు, టీ20 లు, టెస్టులు.. ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్‌పై వీళ్లు వేసిన ముద్ర సాధారణమైంది కాదు. ఈ ఇద్దరూ ధోని సారథ్యంలోనే భారత జట్టుకు అరంగేట్రం చేసినా ఒకరి నాయకత్వంలో మరొకరు ఆడారు. ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. అలాంటిది ఈ ఇద్దరూ లేకుండా టీమ్ఇండియా కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నది. టెస్టులు, టీ20ల నుంచి తప్పుకొన్న ఈ దిగ్గజాలు ఇకనుంచి వన్డేలలో మాత్రమే బ్లూజెర్సీలలో కనిపిస్తారు. ఈ జోడీ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతారని ఆశిస్తున్నా.. దానిపై స్పష్టత లేదు. ఆలోపు భారత్ ఆడే వన్డేలు 27 మాత్రమే అన్నది చేదు నిజం!