బెంగళూరు టెస్టులో భారత్ గాడిన పడుతోంది! చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఎదురుదాడికి దిగింది. ఆట రెండోరోజు అలా క్రీజులోకి వచ్చి ఇలా పెవిలియన్‌కు వెళ్లిన భారత బ్యాటర్లు మూడో రోజు మాత్రం దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ అర్ధ శతకాలతో టీమ్ఇండియా కివీస్ ఆధిక్యాన్ని క్రమంగా కరిగిస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల స్కోరు చేసి 354 పరుగుల తిరుగులేని ఆధిక్యాన్ని ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్ మూడో రోజు మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇప్పటికీ టెస్టును శాసించే స్థితిలో ఉంది. మూడో రోజు ఆ జట్టు ఆటగాడు రచిన్ రవీంద్ర శతకంతో మెరవగా టిమ్ సౌథీ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. నాలుగో రోజు భారత మిడిలార్డర్ కివీస్ బౌలర్లను ఏ మేరకు అడ్డుకుంటుందనే దానిపై ఈ టెస్టులో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. శనివారం మొత్తం ఆడగలిగి కివీస్ ముందు భారీ లక్ష్యం నిలపగలిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి గండం నుంచి బయటపడే అవకాశం లేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేనకు ఇక మిగిలింది పోరాటమే!
Bengaluru Test | బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యాతారాహిత్యమైన ఆటతీరుతో 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దూకుడుగా ఆడుతోంది. టాపార్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (102 బంతుల్లో 70, 8 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 నాటౌట్, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సారథి రోహిత్ శర్మ (63 బంతుల్లో 52, 8 ఫోర్లు, 1 సిక్స్) కివీస్ బౌలింగ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 49 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
ఓవర్‌కు 4.7 సగటుతో పరుగులు రాబట్టిన రోహిత్ సేన.. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 125 పరుగులు వెనుకంజలోనే ఉంది. అంతకముందు న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 402 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134, 13 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సౌథీ (73 బంతుల్లో 65, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడి పర్యాటక జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు.
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ల ధాటికి బెంబేలెత్తిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలబడ్డారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (35), రోహిత్ కలిసి తొలి వికెట్‌కు 72 పరుగుల శుభారంభాన్ని అందించారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఈ ఇద్దరూ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. కానీ అజాజ్ పటేల్ వేసిన 18వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన జైస్వాల్.. స్టంపౌట్ అయి వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. హెన్రీ 21వ ఓవర్లో 4, 6, 4తో 59 బంతుల్లోనే హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మరుసటి ఓవర్లోనే అజాజ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడినా అది కాస్తా వికెట్లను పడగొట్టడంతో రోహిత్ నిరాశగా మైదానాన్ని వీడాడు.
ఈ క్రమంలో కోహ్లీకి జతకలిసిన సర్ఫరాజ్.. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అజాజ్, ఓరూర్కీ బౌలింగ్‌లో చూడచక్కని షాట్లతో బంతిని బౌండరీ లైన్ దాటించాడు. సర్ఫరాజ్ దూకుడుతో కోహ్లీ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. అజాజ్ 30వ ఓవర్లో 6, 4, 4 బాదాడు. అతడే వేసిన 32వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. ఇదే ఊపులో 42 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులలో అతడు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో ఇది నాలుగో అర్ధ శతకం కావడం విశేషం. కొద్దిసేపటికే కోహ్లీ సైతం ఈ ఏడాది టెస్టులలో తొలి అర్ధ శతకాన్ని సాధించాడు. ఈ ఇద్దరూ వంద బంతుల్లోనే శతక భాగస్వామ్యాన్ని పూర్తిచేశారు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా గ్లెన్ ఫిలిప్స్ వేసిన 49వ ఓవర్లో ఆఖరి బంతి కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ బ్లండెల్ చేతిలో పడటంతో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సర్ఫరాజ్-కోహ్లీ కలిసి మూడో వికెట్‌కు 136 రన్స్ జోడించారు.
మూడో రోజు 180/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ ఆరంభ ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయింది. మిచెల్ (18)ను సిరాజ్ ఔట్ చేయగా బ్లండెల్ (5)ను బుమ్రా వెనక్కి పంపాడు. ఫిలిప్స్ (14), హెన్రీ (8) వికెట్లు జడ్డూ ఖాతాలోకి వెళ్లాయి. కానీ సౌథీతో కలిసి కివీస్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరూ వన్డే తరహా ఆట ఆడారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి రోహిత్ పదే పదే బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. లంచ్ విరామానికి ముందే తన కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న రచిన్.. ఆ తర్వాత జోరు పెంచాడు. మరో ఎండ్‌లో సౌథీ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ తర్వాత సౌథీ నిష్క్రమించడంతో 134 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రచిన్‌ను కుల్దీప్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
పరుగుల యంత్రం కోహ్లీ ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించడంతో టెస్టులలో 9వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. వ్యక్తిగత స్కోరు 53 పరుగుల వద్దకు చేరుకోగానే అతడు ఈ ఘనతను అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ (15,921), ద్రావిడ్ (13,265), గవాస్కర్ (10,122) కోహ్లీ కంటే ముందున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్ (రచిన్ 134, కాన్వే 91, జడేజా 3/72, కుల్దీప్ 3/99), భారత్ రెండో ఇన్నింగ్స్: 231/3 (కోహ్లీ 70, సర్ఫరాజ్ 70 నాటౌట్, అజాజ్ 2/70)
మూడో రోజు ఆటలో నమోదైన పరుగులు. టెస్టులలో ఒక రోజు ఆటలో ఇన్ని పరుగులు చేయడం భారత్‌లో ఇది రెండోసారి. 2009లో శ్రీలంక, భారత్ కలిసి 470 పరుగులు చేయడమే ఇప్పటివరకూ అత్యుత్తమం.