WTC Final | దశాబ్ద కాలంగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకునేందుకు టీమ్ఇండియా పోరాడుతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల ప్రపంచ రికార్డు చేజింగ్‌లో భారత్ 164/3తో నిలిచింది. భారత విజయానికి చివరి రోజు 90 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా 7 వికెట్ల దూరంలో ఉంది. ఇప్పటికే రోహిత్, గిల్, పుజారా పెవిలియన్ చేరిపోగా.. కోహ్లీ, రహానే పోరాడుతున్నారు. ఆదివారం తొలి సెషన్లో కంగారూ పేసర్లను ఈ జోడీ ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది!
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత బ్యాటింగ్ బలగానికి అసలు సిసలు పరీక్ష ఎదురవుతున్నది. 2013లో చాంపియన్స్ ట్రోపీ నెగ్గిన అనంతరం ఇప్పటి వరకు మరో ఐసీసీ టైటిల్ గెలువలేకపోయిన టీమ్ఇండియా.. డబ్ల్యూటీసీ గద చేజిక్కించుకునేందుకు పోరాడుతున్నది. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ సేన శనివారం ఆట ముగిసే సమయానికి 164/3తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43; 7 ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (18), చతేశ్వర్ పుజారా (27; 5 ఫోర్లు) వెనుదిరగగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్; 7 ఫోర్లు), అజింక్యా రహానే (20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న టీమ్ఇండియా విజయానికి ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా.. 90 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేక 7 వికెట్లు నేలకూల్చి ఆసీస్ చాంపియన్‌గా అవతరిస్తుందా అనేది చూడాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 270/8 వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ కారీ (66 నాటౌట్; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. స్టార్క్ (41; 7 ఫోర్లు), లబుషేన్ (41) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ, ఉమేశ్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
ఈ ఇద్దరిపైనే ఆశలు..
అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేసి చేజ్మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీపై టీమ్ఇండియా గంపెడు ఆశలు పెట్టుకుంది. టాప్-3 బ్యాటర్లు ఔటైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించాలంటే విరాట్ తనలోని పోరాట యోధుడిని తట్టిలేపాల్సిన అవసరముంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉన్న రహానే అండతో కోహ్లీ మ్యాచ్‌ను భారత్ వశం చేయాలని శతకోటి అభిమానులు ఆశిస్తున్నారు. నాలుగోరోజు సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. అదే జోరు కొనసాగిస్తే.. లక్ష్య ఛేదన పెద్ద కష్టం కాదు. కానీ.. పోరాటానికి మారుపేరైన కంగారూలు అంత తేలికగా వదులుతారని అనుకోకూడదు.
ఔటా.. నాటౌటా!
రెండో ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తీరు భారీ చర్చకు దారితీసింది. బోలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ తొలి బంతికి గిల్ కొట్టిన షాట్‌ను కామెరూన్ గ్రీన్ ఎడమ చేత్తో అందుకున్నాడు. అయితే బాల్ నేలకు తాకినట్లు రిప్లేల్లో కనిపించినా.. థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మైదానంలో ప్రేక్షకులు చీటర్స్, చీటర్స్ అనే నినాదాలు చేయడం వినిపించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 270/8 డిక్లేర్డ్ (కారీ 66 నాటౌట్, స్టార్క్ 41; జడేజా 3/58, షమీ 2/39),
భారత్ రెండో ఇన్నింగ్స్: 164/3 (కోహ్లీ 44 బ్యాటింగ్, రోహిత్ 43; లియాన్ 1/32).