Virat Kohli – Test Mace : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) ఆస్ట్రేలియాపై ఓటమి సగటు అభిమానిని ఎంతగానో కలిచి వేసింది. మూడు నెలల క్రితం సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసిన జట్టేనా ఇలా ఆడింది? అనే ప్రశ్నను మిగిల్చింది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమం సమయంలో భారత ఆటగాళ్లు బాధతో టెస్టు గద(Test Mace) పక్కనుంచే వెళ్లారు. విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం ఆ టెస్టు గదను కన్నెత్తి కూడా చూడలేదు. మైదానంలో చిరుతలా దూకుడు ప్రదర్శించే కోహ్లీ.. అలా మౌనంగా, విచారంగా ఉండడం అభిమానులను మరింత బాధపెట్టింది.
కోహ్లీ టెస్టు గద పక్క నుంచి వెళ్తున్న ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్.. ‘చాలా బాధాకరమైన ఫొటో’ అని, ‘అతను మళ్లీ వస్తాడు’ అని, ‘గొప్ప టెస్టు కెప్టెన్. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవకపోవడం విచారకరం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘టెస్టు గద పక్కనుంచి వెళ్తున్న కోహ్లీ. చాలా బాధగా ఉంది. అతను ఏదో ఒకరోజు కచ్చితంగా దాన్ని సాధిస్తాడు’ అని మరొకొందరు పోస్టుల్లో రాసుకొచ్చారు.
This frame of Virat Kohli walking past the Test Mace which he used to own once, feels so heavy 💔 pic.twitter.com/q7hpnqM2yf
— Pari (@BluntIndianGal) June 11, 2023
విరాట్ కోహ్లీ(49)
భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగు పెట్టగానే అభిమానులంతా ఎగిరి గంతేశారు. ఈసారి టెస్టు గద మనదేనంటూ తెగ మురిసిపోయారు. కానీ, వాళ్ల అంచనా తప్పింది. ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే చాప చుట్టేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 14 రన్స్‌కే ఔటైన కోహ్లీ… నాలుగో రోజు పట్టుదలతో ఆడాడు. ఓవర్ నైట్ స్కోర్ 45తో ఐదోరోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే.. మరో 4 పరుగులు కొట్టి బోలాండ్ ఓవర్ల్ స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. స్మిత్ స్లిప్‌లో పల్టీ కొడుతూ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఈ స్టార్ ప్లేయర్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది. లియాన్ ఓవర్లో సిరాజ్ ఔట్ కావడంతో టీమిండియా 234కు ఆలౌటయ్యింది. దాంతో 209 పరుగులతో ఆసీస్ అద్భుత విజయం సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది.