వాషింగ్టన్, జనవరి 5: రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. తాను సంతోషంగా లేనని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలుసునని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆదివారం ప్రయాణిస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. భారత్ వాణిజ్యం కొనసాగిస్తే వెంటనే ఆ దేశంపై సుంకాలు పెంచుతాం అంటూ ట్రంప్ హెచ్చరించారు. గత ఏడాది భారత్‌పై సుంకాల దాడిని ప్రారంభించిన ట్రంప్ మొదట ప్రతీకార సుంకాల పేరిట 25 శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్‌పై అత్యధికంగా 50 శాతం సుంకాల భారం పడింది. ఈ చర్య రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీసింది.
సుంకాల ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కొన్ని వారాల క్రితమే మోదీతో టెలిఫోన్లో మాట్లాడిన ట్రంప్ మళ్లీ సుంకాల పెంపుపై తాజా హెచ్చరికలు జారీచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుంకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు భారత్, అమెరికా ప్రతినిధులు చర్చలు మళ్లీ ప్రారంభించిన రోజే ట్రంప్, మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ ఫోన్ సంభాషణ జరగడానికి కొన్ని రోజుల ముందే భారత్, చైనా, థాయ్‌లాండ్ నుంచి బియ్యం దిగుమతులు ముంచెత్తుతున్నాయని ఓ అమెరికా రైతు ప్రతినిధి వైట్‌హౌస్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఫిర్యాదు చేయగా భారతీయ బియ్యంపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు ఎందుకు అనుమతి ఇవ్వాలి? ఆ దేశం సుంకాలు చెల్లించాల్సిందే.
బియ్యంపై వారికేమైనా మినహాయింపు ఉందా అంటూ ఆ సమావేశంలో ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ని ట్రంప్ ప్రశ్నించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని బెస్సెంట్ గుర్తు చేయగా అయినప్పటికీ భారత్ అలా చేయకూడదని, దీన్ని తాము పరిష్కరిస్తామని, సుంకాలతో సమస్య రెండు నిమిషాల్లో పరిష్కారమవుతుందని ట్రంప్ ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సుంకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్, అమెరికా మధ్య ప్రారంభమైన చర్చలు మళ్లీ నిలిచిపోయాయి. తన వ్యవసాయ ఉత్పత్తులపై భారీ దిగుమతి సుంకాలను అడ్డుకోవడానికి అమెరికా ఒత్తిడి తీసుకువస్తుండగా తన దేశ వ్యవసాయ, పాడి రంగాలను పరిరక్షించుకోవాలని భారత్ భావిస్తున్నది.