వాషింగ్టన్, జనవరి 5: తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనెజువెలాకు ఏది మంచిదని అమెరికా భావిస్తున్నదో ఆ పని డెల్సీ చేయకపోతే మదురో కన్నా భయంకరమైన గతి ఆమెకు పడుతుంది అని అట్లాంటిక్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. అంతకుముందు న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రతిపాదనకు డెర్సీ రోడ్రిగ్స్ అంగీకరిస్తే వెనెజువెలాలో అమెరికన్ దళాలను మోహరించాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
ఇలా ఉండగా వెనెజువెలా అధ్యక్షుడు మదురోను గద్దె దించడంపై అమెరికా చర్యను వెనెజువెలా తాత్కాలిక ప్రధాని డెర్సీ రోడ్రిగ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే మదురోను తమ దేశానికి పంపించివేయాలని ఆమె అమెరికాను కోరారు. వెనెజువెలాపై అమెరికా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సోమవారం అత్యవసరంగా సమావేశం కానున్నది. వెనెజువెలా అధ్యక్షుడు మదురో నిర్బం ధానికి సంబంధించిన చట్టబద్ధతను మండలి విస్తృతంగా చర్చించనున్నది.
మదురో అరెస్ట్ తర్వాత వెనెజువెలాలో ఎన్నికలు జరుగొచ్చన్న అంచనాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ ప్రతిపక్ష నేత మచాడోకు ఎందుకు మద్దతు ఇవ్వలేదనే విషయాన్ని వైట్‌హౌస్ అధికారులు బయటపెట్టారు! తనకు లభిస్తుందని ఆశించిన నోబెల్ శాంతి బహుమతి మచాడోకు దక్కడంపై ట్రంప్ అక్కసుతో ఉన్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఇందువల్లే ఆయన మచాడోను గద్దెనెక్కించే ప్రయత్నాలు చేయలేదని వారు చెప్పారు.
వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని మచాడో ఒక్క ప్రకటన చేసి ఉంటే ఆమె ఇప్పటికే వెనెజువెలా అధ్యక్షురాలయ్యే వారని ఇద్దరు అధికారులు తెలిపారు. మదురో అరెస్ట్ వేళ మచాడోకు పగ్గాలు దక్కొచ్చని చాలా మంది అంచనా వేసిన వేళ వెనెజువెలాను ఒంటరిగా వదిలేయమని ట్రంప్ చేసిన ప్రకటనకు కారణం మచాడో పగ్గాలు చేపట్టడం ఆయనకు ఇష్టం లేకపోవడమేనని వారు వెల్లడించారు.