సలాం..సిరాజ్

తండ్రి కన్న కలను నెరవేర్చేందుకు.. ఆ తండ్రి కడచూపునకే దూరమవడం సాధారణ విషయం కాదు. ఒకవైపు పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులంతా వెక్కి వెక్కి ఏడుస్తుంటే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ఓ కుర్రాడు విధి నిర్వహణే ముఖ్యమని ఉబికివస్తున్న దుఃఖాన్ని పంటిబిగువున దాచుకొని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. వేలు పట్టి నడిపించిన తండ్రి లేడనే నిజాన్ని దిగమింగి.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆటలో అంతగా అనుభవం లేకున్నా.. ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత ఎదిగిన మహమ్మద్ సిరాజ్ వ్యక్తిత్వానికి సలాం చేస్తూ..!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా కసరత్తులు చేస్తున్న సమయం.. సీనియర్ పేసర్ షమీతో కలిసి పాతికేండ్ల కుర్రాడు నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లీలాంటి ఆటగాడిని తన వేగంతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సమయంలో ఓ చేదు వార్త అతడికి చేరింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న తండ్రి గౌస్ కన్నుమూశారని తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన బీసీసీఐ అతడిని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విషయంపై అతడితో చర్చిస్తే.. ఆ కుర్రాడు మాత్రం జాతీయ విధుల ముందు కుటుంబ బాధ్యతలు పెద్దవి కావు అని బలంగా చెప్పాడు. అతడే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.
తండ్రి మాట కోసమే..
యువ పేసర్ ప్రతిస్పందనతో కదిలిపోయిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అతడి వ్యక్తిత్వాన్ని కొనియాడితే.. గడ్డు పరిస్థితులే నీలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తెస్తాయి అని విరాట్ భరోసానిచ్చాడు. అయితే సిరాజ్ ఈ నిర్ణ యం తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం తన తండ్రి చెప్పిన మాటే. ‘మేరా బేటా దేశ్కా నామ్ రోషన్ కరేగా’(నా కొడుకు దేశాన్ని గర్వించేలా చేస్తాడు) అని తరచూ చెప్పే తండ్రి మాటలను మనసులో బలంగా ముద్రించుకున్న సిరాజ్.. తండ్రిని కడసారి చూడటం కంటే జట్టుతో ఉండి మంచి ప్రదర్శన చేయడమే తన కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు.
జట్టు సభ్యుల అండ..
‘మియా (జట్టు సభ్యులు సిరాజ్‌ను పిలిచే ముద్దుపేరు) టెన్షన్ పడకు. ఇలాంటి పరిస్థితుల్లో దృఢంగా ఉండాలి. నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మీ నాన్న బలంగా కోరుకున్నారు. ఆయన ఆశయాన్ని నిలబెట్టు’అని విరాట్ చేసిన కర్తవ్యబోధతో కార్యోన్ముఖుడైన సిరాజ్.. కంగారూల వికెట్లు పడగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆటో రిక్షా నడుపుతూ రెక్కలు ముక్కలు చేసుకొని తనను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన తండ్రికి విజయాల రూపంలో నివాళి అర్పించాలని ప్రాక్టీస్‌పై మనసు పెట్టాడు.
నువ్వు దేశానికి ఆడాలనేది నీ తండ్రి కల. దాన్ని నిర్వర్తించడమే కర్తవ్యం.చక్కటి ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకో
- సిరాజ్ తల్లి