Vinod Kambli | భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స అందిస్తున్న సమయంలోనే జ్వరం బారినపడ్డారు. ప్రస్తుతం మాజీ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాంబ్లీ థానే జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై అప్డేట్స్ ఇస్తున్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా కొద్దిరోజుల కిందట ఆసుపత్రిలో చేరారని.. చికిత్సకు స్పందిస్తున్నట్లుగా డాక్టర్ త్రివేది తెలిపారు. కాబ్లీకి వైద్యులు ఎంఆర్ఐ చేయాలని నిర్ణయించగా.. జ్వరం కారణంగా కుదరలేదని పేర్కొన్నారు. కాస్త కుదురుకున్నాక ఎంఆర్ఐ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు చేసిన పరీక్షల్లో మెదడులో రక్తం గడ్డకట్టినట్లుగా తేలిందని.. ఈ క్రమంలో ఎంఆర్ఐ తప్పనిసరని డాక్టర్ త్రివేది చెప్పారు. ఒకట్రెండు కాంబ్లీని ఐసీయూ నుంచి బయటకు జనరల్వార్డుకు తరలించి.. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు.
నాలుగు రోజుల కిందట మాజీ క్రికెటర్ పరిస్థితి విషమంగా ఉందని.. మూత్ర నాళానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని.. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాంబ్లీకి సాయం చేసేందుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ సైతం ముందుకు వచ్చింది. ఏక్నాథ్ షిండే ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ మంగేష్ చివ్టే గత రాత్రి ఆసుపత్రికి వెళ్లి మాజీ క్రికెటర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చివ్టే ఆసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి కాంబ్లీకి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఏక్నాథ్ షిండే కుమారుడు, కళ్యాణ్ లోక్సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కాంబ్లీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన కుటుంబానికి మరింత సహాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.