అయోధ్య: రెజ్లర్ వినేశ్ పోగట్(Vinesh Phogat) వివాదం ఇంకా రాజుకుంటోంది. జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనేందుకు ఆమె ఇవాళ గోండా చేరుకున్నారు. అయితే టోర్నీలో పాల్గొనేందుకు ఆమెకు భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి అనుమతి దక్కలేదు. షో కాజు నోటీసుకు తగిన వివరణ ఇవ్వలేదని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొన్నది. రిటైర్మెంట్ తర్వాత తాను మళ్లీ పోటీపడేందుకు అర్హురాలిని అని ఆమె చెప్పుకున్నది. అయితే స్వదేశీ ఈవెంట్లలో జూన్ 26వ తేదీ వరకు వినేశ్ పోగట్ పాల్గొనడానికి అర్హత లేదని డబ్ల్యూఎఫ్ఐ తన నోటీసులో పేర్కొన్న విషయం తెలిసిందే.
రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అథ్లెట్లు మళ్లీ పోటీల్లో పాల్గొనాలంటే ఆరు నెలల గ్యాప్ ఉండాల్సిందే. ఈ నియమం ప్రకారం ఆమె అర్హురాలు కాదు అని భారత రెజ్లింగ్ సమాఖ్య తన షోకాజులో పేర్కొన్నది. కానీ వినేశ్ మాత్రం అయోధ్య చేరుకున్నది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీలోని రూల్ 5.6.1 ప్రకారం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు తన కమ్‌బ్యాక్ గురించి చెప్పినట్లు వినేశ్ వెల్లడించింది. గత జూన్‌లోనే ఈ విషయాన్ని చేరవేసినట్లు ఆమె చెప్పింది.
రిటైర్మెంట్ తర్వాత మళ్లీ పోటీపడాలని భావిస్తున్న అథ్లెట్లు యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకారం టోర్నీకి ఆర్నెళ్ల ముందు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ వినేశ్ ఇచ్చిన వివరణతో రెజ్లింగ్ సమాఖ్య సంతృప్తి చెందలేదు. కేవలం అర్హత గురించి మాత్రమే ఆమె వివరణ ఇచ్చిందని, కానీ క్రమశిక్షణా చర్యల గురించి ఆమె ఎటువంటి వివరణ ఇవ్వలేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది.
జాతీయ టోర్నీలో పాల్గొంటున్న మహిళా రెజర్లకు ఇవాళ సాయంత్రం 5 నుంచి 7 వరకు వెయిట్ చెకింగ్ చేయనున్నారు. మంగళవారం వాళ్లకు పోటీలు నిర్వహిస్తారు. ఈ టోర్నీలో గెలిచిన వాళ్లకు వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో పోటీపడే అవకాశం ఇస్తారు.