నాగ్‌పూర్: విదర్భ స్టార్ బ్యాటర్ కరణ్ నాయర్.. దేశవాళీలో దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థి జట్లను చీల్చిచెండాడుతూ శతక జోరు కొనసాగిస్తున్నాడు. కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో కరణ్ నాయర్(280 బంతుల్లో 132 నాటౌట్, 10ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఈ సీజన్లో ఓవరాల్‌గా తొమ్మిదో సెంచరీ ఖాతాలో వేసుకున్న నాయర్‌కు రంజీల్లో ఇది నాలుగోది కావడం విశేషం. నాయర్ సెంచరీతో విదర్భ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది.
7 పరుగులకే ఓపెనర్లు పార్థ్ రేఖాడే(1), ధృవ్ షోరే(5) వికెట్లు కోల్పోయిన విదర్భను దానిశ్ మలెవార్(73), నాయర్ ఆదుకున్నారు. వీరిద్దరు కేరళ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా మంచి ఫామ్‌మీదున్న నాయర్ తన ఇన్నింగ్స్‌లో 10ఫో ర్లు, రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు. చంద్రన్ బౌలింగ్‌లో మలెవార్ ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 187పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న విదర్భ ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. నిదీశ్, సక్సేనా, ఆదిత్య, అక్షయ్ ఒక్కో వికెట్ తీశారు. ఆదివారం ఆటకు చివరి రోజు.