IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. తన ఆట కూడా ఓ సంచలనమే అని నిరూపిస్తూ మరో రికార్డు సాధించాడీ కుర్రాడు. ఇప్పటికే మెగా లీగ్‌లో ఆడిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన అతడు.. ఇప్పుడు ఏకంగా అర్ద శతకంతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో హాఫ్ సెంచరీ బాదిన అటగాడిగా అవతరించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్లతో హోరెత్తించాడు వైభవ్.. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడిన ఈ కుర్రకెరటం 17 బంతుల్లోనే ఫిఫ్టీకి చేరువయ్యాడు. 6 సిక్సర్లు, 3 ఫోర్లతో అతడు ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.
ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.5 కోట్లకు అమ్ముడుపోయిన వైభవ్ వార్తల్లో నిలిచాడు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడడంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడీ చిచ్చరపిడుగు. ఆ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో స్టంపౌట్ అయిన వైభవ్.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 18వ ఎడిషన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్‌ది రెండో వేగవంతమైన అర్ధ శతకం కాగా.. యశస్వీ జైస్వాల్ 16 బంతుల్లోనే ఫిఫ్టీతో టాప్‌లో ఉన్నాడు.