Kolkata Knight Riders | కోల్‌కతా: మరో మూడు వారాల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్‌కు గాను డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ సారథిగా భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేను నియమించింది. రహానేకు సారథ్య పగ్గాలను అప్పగించిన కేకేఆర్ యాజమాన్యం.. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత సీజన్లో తమకు మూడో ఐపీఎల్ ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోకపోవడంతో పాటు వేలంలోనూ వదిలేసిన కేకేఆర్.. అనూహ్యంగా వెంకటేశ్‌ను రూ. 23.75 కోట్ల రికార్డు ధరతో దక్కించుకుంది. రహానేను కేకేఆర్ కొనుగోలు చేసినప్పుడే అతడితో పాటు వెంకటేశ్‌లో ఎవరికో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. రహానేకు గతంలో ఐపీఎల్లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌కు పలు మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది.