కోల్‌కతా: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తండ్రి, దిగ్గజ హాకీ ప్లేయర్ డాక్టర్ వేస్ పేస్ (80) కన్నుమూశారు. చాలాకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురువారం ఉదయం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 1945లో గోవాలో జన్మించిన వేస్.. చదువుతో పాటు ఆటల్లోనూ చురుకైన విద్యార్థిగా ఉండేవారు. ఒకవైపు మెడిసన్ చేస్తూనే మరోవైపు హాకీ పట్ల మక్కువ చూపిన ఆయన.. ఈ ఆటలో మిడ్ ఫీల్డర్‌గా అద్భుతాలు చేశారు.
1965లో భారత హాకీ జట్టులోకి అరంగేట్రం చేసిన పేస్.. 1971లో బార్సిలోనాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఇక 1972లో మునిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో పేస్ మిడ్ ఫీల్డర్‌గా కీలకపాత్ర పోషించారు. ఆయన ఒత్తిడిలోనూ తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేవారు. ఆట నుంచి వైదొలిగాక భారత డేవిస్ కప్ టీమ్‌కు టీమ్ డాక్టర్‌గా వ్యవహరించారు.
కొన్నిరోజుల పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కూడా ఆయన మెడికల్ కన్సల్టెంట్‌గా సేవలందించారు. వేస్‌కు హాకీతో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ ఆటలోనూ ప్రావీణ్యముంది. వేస్ కుమారుడు లియాండర్ పేస్ కూడా తండ్రిబాటలోనే క్రీడల్లో భారత కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయి లో ఎగురవేసిన విషయం తెలిసిందే. టెన్నిస్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన లియాండర్.. తండ్రి మాదిరిగానే ఒలింపిక్స్ (1996 అట్లాంట)లో టెన్నిస్‌లో కాంస్యం గెలిచాడు. వేస్ భార్య జెన్నిఫర్ కూడా క్రీడాకారిణే. ఆమె భారత బాస్కెట్‌బాల్ జట్టుకు సారథిగా వ్యవహరించారు.