VC Sajjanar | మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అంటూ ఆయన ప్రశ్నించారు. బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? అంటూ ప్రశ్నించారు. సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి అంటూ సోషల్ మీడియా వేదికగా హితవు పలికారు.
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్ కేసులో కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లకు చెందిన రూ.11.14కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్‌బెట్ (1xBet)కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని, రూ.6.64 కోట్ల విలువైన రైనా మ్యూచువల్ ఫండ్స్‌ను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ వ్యవహారంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. బెట్టింగ్స్ యాప్స్‌కు మద్దతుగా పలువురు ప్రముఖ సినీతారలు, క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటీనటులు సోనుసూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రాతో పాటు పలువురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
వీళ్లేం సెలబ్రిటీలు?
అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?
బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025