Vaibhav Suryavanshi | ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్లేట్ లీగ్ సీజన్లో బిహార్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఢీకొట్టనున్నది. ఈ లీగ్‌కు బిహార్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. బుధవారం నుంచి ప్రారంభంకానున్న రాబోయే రంజీ ట్రోఫీ సీజన్లో తొలి రెండు మ్యాచులకు యువ బ్యాట్స్‌మెన్, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సకిబుల్ గని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15న మోయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరిగే ప్లేట్ లీగ్ సీజన్లో బీహార్ తన తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనున్నది. అయితే, గత రంజీ ట్రోఫీ సీజన్లో ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడంతో బిహార్‌ను ప్లేట్ లీగ్ దశకు కుదించారు.
సూర్యవంశీ 2023-24 సీజన్లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కుడిగా (13 ఏళ్లు) నిలిచాడు. భారత అండర్-19 జట్టుతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో కూడా పర్యటించాడు. ఐపీఎల్ కోసం రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని ఎంపిక చేసింది. గుజరాత్ టైటాన్స్‌పై టీ20లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14) ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్లో రెండో వేగవంతమైన సెంచరీ కూడా. వచ్చే ఏడాది ప్రారంభంలో జింబాబ్వే, నమీబియాలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో స్థానం కోసం సూర్యవంశీ పోటీ పడుతున్నాడు.
సకిబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్-కెప్టెన్), పియూష్ కుమార్ సింగ్, భాస్కర్ దూబే, అర్ణవ్ కిశోర్, ఆయుష్ లోహరుకా, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్, ఖలీద్ ఆలం, సచిన్ కుమార్.